ఆంధ్రుల రాజధాని అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. అద్భుతమైన మహా నగరంగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి…జగన్, వైసీపీ నేతల దెబ్బకు అధ్వాన్నంగా తయారైంది. అయితే, సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత అమరావతి ఊపిరి పీల్చుకుంది. అమరావతికి పునరుజ్జీవం కల్పించిన చంద్రబాబు…ఏపీ రాజధాని అభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నారు.
ఓ వైపు కేంద్రం నుంచి, మరో వైపు ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు రాబట్టి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అమరావతిని ఆశీర్వదించాలని ప్రధాని మోడీని కూడా ఏపీకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే అమరావతి రాజధానిపై సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి కోసం మరో 30 వేల ఎకరాల భూసేకరణ చేయాలని ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఆల్రెడీ ఆ భూ సమీరణకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 33 వేల ఎకరాల్లో రాజధాని పనులు ప్రారంభమయ్యేందుకు రంగం సిద్ధమైంది. తాజాగా మరో 30 వేల ఎకరాలను కోర్ క్యాపిటల్ బయట భూసేకరణ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని విజన్-2047 దిశగా ఈ ఆలోచనకు చంద్రబాబు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.