స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా..చంద్రబాబు తరఫున ప్రముఖ లాయర్ దూబే వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ల విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. అంతేకాదు, చంద్రబాబుకు మరో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. మరో 15 రోజుల పాటు చంద్రబాబుకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలంటూ సీఐడీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు.
దీంతో, ఈ నెల 19 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. అదే సమయంలో ఆయన బెయిల్ పిటిషన్ పై ఈ రోజే విచారణ జరిగింది. దీంతో, చంద్రబాబుకు బెయిల్ రావడం ఖాయమని టీడీపీ నేతలు, కార్యకర్తలు భావించారు. కానీ, చంద్రబాబుకు మాత్రం కోర్టులో ఊరట లభించలేదు.
ఇక, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ప్రక్రియలో లోపాలకు, ఎవరో చేసిన తప్పులకు అప్పటి సీఎంను ఎలా బాధ్యులు చేస్తారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. కేసు నమోదు చేసి రెండు సంవత్సరాలు అయిందని, ఇప్పుడు నిందితుడిగా చేర్చడం ఏమిటని వాదనలు వినిపించారు.