ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురించి కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “జగన్ గురించి మీరు ఏమీ ఆలోచించకండి. ఆయన విషయాన్ని మాకు వదిలేయండి. మేం చూసుకుంటాం“ అని అమిత్ షా నర్మగర్భంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అంతేకాదు.. జగన్ ఇప్పటికే ప్రజల నుంచి బలమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని.. ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలిసింది. ఈ మేరకు ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి.. అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారని సమాచారం.
శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చిన అమిత్ షా.. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసానాకి వచ్చారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబుతో ఏకాంతంగా గంటసేపు చర్చలు జరిపారు. రాష్ట్రంలో కూటమి పాలన, ప్రజల మద్దతు, శాంతి భద్రతల అంశాన్ని ప్రస్తావించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సందర్భంగా జగన్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గురించి మీరు చింతిం చాల్సిన అవసరం లేదని.. ఆయన విషయాన్ని తమకు వదిలి పెట్టాలని షా సూచించినట్టు సమాచారం. ఇదేసమయంలో ప్రజల మద్దతును మరింత చూరగొనే విషయాలపై దృష్టి పెట్టాలని కోరినట్టు తెలిసింది.
జగన్ ప్రస్తావన ఎందుకు?
అసలు అమిత్ షా పర్యటన నేపథ్యంలో జగన్ ప్రస్తావన ఎందుకు వచ్చిందన్నది కీలకంగా మారింది. త్వరలోనే జమిలి ఎన్నికల బిల్లుకు పార్లమెంటు ఓకే చెప్పనుంది. దీనిపై ఇప్పటికే స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంపీల మద్దతు.. పార్లమెంటులో సునాయాసంగా ఈ బిల్లును ఆమోదించుకోవడం వంటి అంశాలు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా అమిత్‌షా విజయవాడకు రావడం.. జమిలి బిల్లుపై అసెంబ్లీ తీర్మానం పై ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ బిల్లుకు ఇప్పటికే టీడీపీ, జనసేనలు మద్దతు తెలిపాయి. వైసీపీ కూడా జమిలి కోరుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంలోనే జగన్ గురించిన ప్రస్తావన వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించిన షా.. జగన్ విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని.. సరైన సమయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్టు సమాచారం. అయితే.. ఇది అంతరంగిక సమావేశం కావడం.. పైగా షా వచ్చిన సమయంలో భారీ భద్రత ఉన్న నేపథ్యంలో లోపల ఏం చర్చించుకున్నారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.