టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కొంతకాలం క్రితం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాలవైపు ఫోకస్ చేసిన రాయుడు వైసీపీలో చేరారు. ఈ క్రమంలోనే ఆడుదాం ఆంధ్రా అంటూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అంబటి రాయుడు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ ఈవెంట్ ప్రకటించిన తొలి రోజు నుంచే ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్నారు.
అంతేకాదు, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలతో ఆంధ్రాలో సెలక్షన్స్ పెట్టిస్తానని రాయుడు అన్నారు. అయితే, అనూహ్యంగా ఈ రోజు జరిగిన ఆడుదాం ఆంధ్రా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాయుడు హాజరు కాలేదు. గుంటూరు జిల్లాలోని నల్లపాడులో సీఎం జగన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కాగా..రాయుడు దానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
రాయుడు ఎక్కడికి వెళ్లాడు…ఎందుకు ఈ ప్రోగ్రామ్ కు రాలేదు అన్న చర్చ మొదలైంది. ఆడుదాం ఆంధ్రాలో మొదటి వికెట్ పడిందా? అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్ లో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటలు ఉంటాయి. మరి ఈవెంట్ మధ్యలో అయినా రాయుడు దర్శనిమిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.