మెగా ఫ్యామిలీలో గత కొంత కాలంగా నెలకొన్న వర్గ విభేదాల గురించి తెలిసిందే. అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో చాలామందికి అస్సలు పడట్లేదు. ‘సరైనోడు’ మూవీ ఈవెంట్లో ‘చెప్పను బ్రదర్’ కామెంట్‌తో మొదలుపెడితే.. చాలా అంశాలు బన్నీ పట్ల ఆ వర్గంలో వ్యతిరేకత పెరగడానికి కారణమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి అయిన తన మిత్రుడు శిల్పా రవికి బన్నీ ప్రచారం చేయడంతో ఈ వ్యతిరేకత మరింత తీవ్రమైంది. ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వచ్చాక కూడా ఈ గొడవ కొనసాగింది. ఐతే బన్నీ పీఆర్ టీం ఈ విషయమై మెగా అభిమానులను కూల్ చేయడానికి సోషల్ మీడియాలో కొంత ప్రయత్నం చేస్తున్న సంకేతాలు కనిపించాయి. నెమ్మదిగా ఈ విషయాన్ని అందరూ మరిచిపోతున్నట్లే కనిపించారు.
కానీ అల్లు అర్జున్ మళ్లీ ఈ తేనె తుట్టెను కదిపినట్లయింది ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో. సుకుమార్ సతీమణి ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కావడంతో తాను ‘పుష్ప-2’ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా వీలు చేసుకుని ఈ ఈవెంట్‌కు వచ్చానని చెబుతూ.. తనకు నచ్చితే, ఫ్రెండు కోసం ఎక్కడికైనా వస్తానని.. ఇందులో మరో మాట లేదని బన్నీ తేల్చి చెప్పాడు. ఫ్రెండు కోసం, తనకు నచ్చితే వస్తా అని నొక్కి చెప్పడం చూస్తే.. శిల్పా రవికి ప్రచారం చేసిన విషయంలో తనను విమర్శించే వారికి బన్నీ సమాధానం ఇది అనిపిస్తోంది.
ఐతే ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వివాదాన్ని బన్నీ ఈ వ్యాఖ్యలతో మళ్లీ రాజేసినట్లయిందనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. అంతే కాక తన అభిమానులను కొనియాడుతూ.. ‘‘మామూలుగా హీరోలను చూసి అభిమానులు అవుతుంటారు. కానీ నేను మాత్రం అభిమానులను చూసి హీరోనయ్యా’’ అంటూ బన్నీ చేసిన కామెంట్ పట్ల కూడా మెగా అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిరు పేరు చెప్పుకుని, మెగా అభిమానుల అండతో హీరోగా ఎదిగిన అతను.. తనకు ప్రత్యేకంగా ముందు నుంచి అభిమానులు ఉండబట్టి వారిని చూసి హీరోనయ్యాను అన్నట్లు మాట్లాడ్డాన్ని తప్పుబడుతున్నారు. బన్నీ కావాలనే ఈ వ్యవహారాన్ని తెగేదాకా లాగుతున్నారని అతడిపై ఆ వర్గం విమర్శలు గుప్పిస్తోంది.