కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అలిపిరి నడక దారిలో వెళ్తున్న చిన్నారులపై వరుసగా చిరుత దాడులు జరుగుతున్న వైనం భక్తులలో భయాందోళనలు రేకెత్తించిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని చిరుత బలి తీసుకున్న నేపథ్యంలో నడకదారిలో కట్టుదిట్టమైన భద్రతకు టీటీడీ నడుం బిగించింది. ఈ నేపథ్యంలోనే భక్తులు…ప్రత్యేకించి చిన్న పిల్లల రక్షణకు టిటిడి పలు ఆంక్షలు, నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇకపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలకు అలిపిరి నడక దారిలో అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది.
అలిపిరితోపాటు శ్రీవారిమెట్టు నడకదారులలో పిల్లల ప్రవేశంపై పలు ఆంక్షలను టిటిడి విధించింది. మరోవైపు, 7వ మైలురాయి వద్ద పిల్లల చేతికి ట్యాగ్ లను పోలీసులు వేస్తున్నారు. ఆ ట్యాగ్ పై పిల్లల పేరు, ఫోన్ నెంబర్, తల్లిదండ్రుల వివరాలు, పోలీసు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటాయి. ఇక, ఘాట్ రోడ్లలో బైక్ లను సాయంత్రం 6 గంటల తర్వాత అనుమతించబోమని టిటిడి అధికారులు వెల్లడించారు. ఇకపై, నడక మార్గంలో భక్తులను గుంపులు గుంపులుగా పంపించేందుకు టీటీడీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
100 మంది భక్తుల బృందానికి ఒక రోప్ పార్టీని, భద్రతా సిబ్బందిని రక్షణకవచంలాగా ఏర్పాటు చేసి పంపేలాగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాగా, చిన్నారి లక్షితను బలి తీసుకున్న చిరుత పులిని తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 38వ మలుపు వద్ద గుర్తించినట్లు తెలుస్తోంది. చిరుతను చూసిన వాహనదారులు తక్షణమే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు చిరుతను అడవిలోకి తరిమారు. ఆ చిరుతను పట్టుకునేందుకు రెండు బోన్లను, 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.