తమ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకుండా డిజాస్టర్లుగా నిలిస్తే తట్టుకొని నిలబడగలిగే హీరోలు కొందరుంటారు. అయితే, తమ సినిమాను నమ్ముకొని ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నష్టపోతే చూస్తూ ఊరుకోకుండా….వారి నష్టాలను భరించే హీరోలు మరికొందరుంటారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లతో పాటు మరికొందరు హీరోలు ఈ రెండో కోవలోకే వస్తారు.
ఇక, తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ ఆమీర్ ఖాన్ చేరారని తెలుస్తోంది. తన సినిమా లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ కావడంతో తన రెమ్యున్ రేషన్ ను నిర్మాతలకు తిరిగిచ్చేయాలని ఆమీర్ ఖాన్ నిర్ణయించుకున్నారట. తన సినిమా వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు అమీర్ ఖాన్ తన రెమ్యునరేషన్ మొత్తాన్ని వదిలేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా కోసం అమీర్ తీసుకున్న రూ. 50 కోట్లను తిరిగి ఇచ్చేయబోతున్నారట.
ఈ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 180 కోట్లు కాగా, ఈ చిత్రానికి అమీర్ ఖాన్ తోపాటు.. అతడి మాజీ భార్య కిరణ్ రావ్ కూడా సహ నిర్మాతలుగా ఉన్నారు. ఆగస్ట్ 11న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు కనీసం రూ. 100 కోట్లు కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ టాక్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సుమారు రూ. 70 కోట్లు మాత్రమే వసూళ్లు చేసిందని తెలుస్తోంది. హాలీవుడ్ క్లాసిక్ మూవీ ఫారెస్ట్ గంప్ నకు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం ఆమీర్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది.