తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా దాటుకుని 67 స్థానాల్లో ఈ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. అయితే.. ఆది నుంచి ఉన్న ప్రధాన సమస్య.. సీఎం సీటు. ఈ సీటు కోసం.. సీనియర్లు.. మేదావులు.. ఇందిరమ్మ కాలం నుంచి ఉన్నవారు.. కూడా పోటీ పడ్డారు. ఇక, ఎన్నికల పోలింగ్ కు కొన్ని రోజుల ముందు వరకు కూడా ఈ సీటు కోసం దాదాపు 12 మంది నాయకులు పోటీలో ఉన్నారని.. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అయితే.. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. నాయకుడు దిగ్భ్రాంతికి గురయ్యారనే చెప్పాలి. పదేళ్లుగా అందని మావిగా ఉన్న అధికారాన్ని అందుకుంటుంటే.. అందునా ఎవరి సాయం కూడా లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే.. నాయకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే దాదాపు నిన్న మొన్నటి వరకు సీఎం రేసులో ఉన్న నాయకులు కూడా మారిపోతున్నారు.
ఈ ఫలితం.. ఈ కష్టం.. మాది కాదు రేవంత్‌దే అంటూ.. కీలక నేతలు తాజాగా వెల్లడించడం ఆశ్చర్యం వేస్తోంది. వీ హనుమంతరావు నుంచి ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వరకు.. అనేక మంది సీఎం రేసులో ఉన్నారు. అయితే.. వీరిలో హనుమంతన్న, కోమటిరెడ్డిలు.. రేవంత్‌కు లైన్ క్లియర్ చేసేశారు. రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను సీఎం రేసులో ఉన్నానా..? లేదా అనేది అప్రస్తుతం అని అన్నారు.
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఈ ఐదేళ్లు ఎలాంటి గొడవలు ఉండవు. సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నామని, సీఎం అభ్యర్థిని ఖర్గే, సోనియాగాంధీ నిర్ణయిస్తార న్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు అక్కడకు వెళ్లారని అన్నారు. అయితే.. దాదాపు సీఎం రేసు నుంచి కోమటిరెడ్డి తప్పుకొన్నారు. ఇక, వీహెచ్ అయితే.. రేవంతే సీఎం సీటు అర్హుడని ప్రకటించడం విశేషం.