తెలంగాణాలో వైఎస్సార్టీపి అధినేత వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద షాకిచ్చినట్లే ఉంది. కాంగ్రెస్ లో తన పార్టీ విలీనంపై ఈనెల 30వ తేదీలోగా ఏ విషయం ప్రకటించాలని షర్మిల డెడ్ లైన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీ విలీనం ఖాయమనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై షర్మిల కూడా బెంగుళూరుకు వెళ్ళి కర్నాటక పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో చర్చలు కూడా జరిపారు.
తర్వాత ఢిల్లీకి వెళ్ళి సోనియాగాంధి, రాహుల్ గాంధిలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కూడా భేటీ అయ్యారు. విలీనానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ అయిపోయాయి ఇక విలీనం ప్రకటన చేయటం ఒక్కటే మిగిలిందనే అంతా అనుకున్నారు. అయితే తెరవెనుక ఏమిజరిగిందో కానీ ఎప్పటికప్పుడు విలీనం ప్రకటన వాయిదాలు పడుతునే ఉంది. చివరకు ఇపుడు విలీనమే అనుమానంగా మారిపోయింది. దీనికి మూడు కారణాలున్నాయి.
అవేమిటంటే ఏపీ ఇన్చార్జి బాధ్యతలు చూసుకోమని కాంగ్రెస్ అధిష్టానం అడిగితే షర్మిల కాదన్నారట. అలాగే ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీకి పోటీచేస్తానని షర్మిల చెబితే అందుకు అధిష్టానం అంగీకరించలేదట. విలీనం అయినా తాను తెలంగాణా రాజకీయాల్లోనే యాక్టివ్ పార్ట్ తీసుకుంటానని షర్మిల చెబితే అందుకు పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మద్యే మార్గంగా షర్మిలకు కర్నాటక కోటాలో రాజ్యసభ ఎంపీని చేసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తారనే ప్రచారం జరిగింది.
అయితే ఆ ప్రచారం ఏమైందో ? వాస్తవం ఏమిటో ఎవరికీ తెలీటంలేదు. షర్మిల పెట్టిన డెడ్ లైన్ను కాంగ్రెస్ అధిష్టానం చాలా లైటుగా తీసుకున్నట్లుంది. అందుకనే డెడ్ లైన్ విషయంలో కీలక నేతలు ఎవరూ స్పందించలేదు. ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీ పెట్టి మూడేళ్ళవుతున్నా ఇంతవరకు జనాలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పటికీ పార్టీ ఉనికి చాటుకోవటం కోసమే పోరాడుతోంది. లీడర్లు, క్యాడర్ తో పాటు జనబలం కూడా లేదు కాబట్టే షర్మిలను కాంగ్రెస్ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదనే ప్రచారం మొదలైంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.