అగ్గిపుల్ల…కుక్క పిల్ల…సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం…అన్న శ్రీశ్రీ కవితను ఆదర్శంగా తీసుకున్న జగన్ ఏపీలో కాదేదీ దోపిడీకనర్హం అన్న రీతిలో ప్రజలను దోచుకుంటున్నారని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తుగ్లక్ ను తలపించేలా జగన్ అండ్ కో కాంట్రాక్టర్లను కూడా బెదిరిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఓ పక్క బిల్లులు రాక కాంట్రాక్టర్లు కుయ్యో మొర్రో అంటుంటే మరో పక్క వైసీపీ నేతలు మాత్రం కాంట్రాక్టర్లను బెదిరించి మరీ మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతల దోపిడీకి ఏదీ అనర్హం కాదంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. రాయచోటిలో రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఎస్సార్కే కన్ స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధులను వైసీపీ నేత కొండారెడ్డి బెదిరించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందిందని లోకేశ్ ఆరోపించారు. తమ మండలంలో పనులు చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందేననికాంట్రాక్టర్ ను చక్రాయపేట మండల వైసీపీ ఇన్చార్జి బెదిరించినట్టు ఫిర్యాదులో ఉందని లోకేశ్ మండిపడ్డారు.
ఇసుక, మద్యం… ఇలా అన్నింటా వైసీపీ నేతలు దోచుకుంటున్నారని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఆ కంపెనీ వారిని బెదిరించి డబ్బులు గుంజబోయారని ఆరోపించారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోనే ఇంత దారుణమైన పరిస్థితులున్నాయని, ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని జరుగుతున్నాయో అర్థమవుతోందని పేర్కొన్నారు. అసలు, ఫిర్యాదుల వరకు రాని దందాలు చాలా ఉన్నాయని అన్నారు. అన్ని వర్గాల వారిని పట్టి పీడిస్తున్న అవినీతి వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.