కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి కొలువుదీరిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్ ను ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత భారత్ లక్ష్యంగా, ప్రధాని మోదీ మేకిన్ ఇండియా విజన్ ను ప్రోత్సహించేలా పారిశ్రామిక వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కింది.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగు బిడ్డ నిర్మలమ్మ తీపి కబురు అందించారు. ఏపీపై ఆమె వరాల జల్లు కురిపించారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, పునర్విభజన చట్టానికి కూడా కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటులో ప్రకటించారు. సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రాజధానికి 15 వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లను ప్రత్యేక సాయంగా అందిస్తామని, అవసరాన్ని బట్టి అమరావతి నిర్మాణానికి అదనంగా నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థ ద్వారా నిధులు సేకరిస్తామని, పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
ఇక, బెంగళూరు-హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్, ఓర్వకల్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ- చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు కేటాయించామని వివరించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేస్తామని వెల్లడించారు.