సుప్రీంకోర్టు న్యాయమూర్తి, రాష్ట్రపతి ఆమోదిస్తే కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై కొద్ది నెలల క్రితం ఏపీ సీఎం జగన్ చేసిన అవినీతి ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థను అపహాస్యం చేసేలా గౌరవప్రదమైన పదవిలో ఉన్న జస్టిస్ రమణపై పలు అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటోన్న జగన్ లేఖ రాయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
దేశపు అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి జగన్ లేఖ రాయడం, అందులోనూ బాబ్డే తర్వాత సీజేఐ రేసులో ఉన్న జస్టిస్ రమణపై తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది. ఆ వ్యవహారం అలా ఉండగానే జస్టిస్ రమణను కాబోయే సీజేఐగా ప్రస్తుత సీజేఐ బాబ్డే కేంద్రానికి సిఫారసు చేశారు. దీంతో, జగన్ కు షాక్ తగిలినట్లయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు మరో షాక్ తగిలింది. జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన ఆరోపణల లేఖ విషయంలో జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ చేసిన ఫిర్యాదును సుప్రీం కోర్టు కొట్టేసింది. ఏపీలోని న్యాయ వ్యవస్థను ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని జగన్ చేసిన ఆరోపణలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 2020 అక్టోబర్ 6న జగన్ లేఖ రాశారని, దానిపై సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ప్రకారం విచారణ జరిపిందని సుప్రీం కోర్టు తెలిపింది. అన్ని విషయాలను లోతుగా పరిశీలించామని, ఆ తర్వాతే ఈ ఫిర్యాదును తోసిపుచ్చామని వెల్లడించింది.
సుప్రీంకోర్టు వెబ్ సైటులో ఈ రోజు ఆ సమాచారాన్ని ఉంచారు. కానీ, ఇన్ హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనదని, దీనికి సంబంధించిన విషయాలు బయటకు వెల్లడించతగినవి కాదని ఆ ప్రకటనలో వెల్లడించారు. దీంతో, ఒకే రోజు జగన్ కు రెండు షాక్ లు తగిలినట్లయింది. కాగా, రాష్ట్రపతి ఆమోదిస్తే ఏప్రిల్ 24న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలుస్తోంది.