ఏపీ దివంగత సీఎం వైఎస్ ఆర్ ప్రవేశపెట్టిన 108, ఆరోగ్య శ్రీ పథకాలు తెలంగాణలో సరిగ్గా అమలుకావడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ పథకాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స అందించలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే షర్మిల ఆరోపణలకు ఊతమిచ్చేలా 108 సిబ్బంది స్పందన ఉండడంతో ఆమె మరోసారి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు మర్రిగూడ సమీపంలోని క్యాంప్‌లో షర్మిల బస చేశారు. అయితే క్యాంప్‌నకు సమీపంలో 2 బైక్‌లు ఢీకొని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న షర్మిల స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. కానీ, అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. తన కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ పై షర్మిల మండిపడ్డారు. తెలంగాణలో 108 సేవలు ఎలా ఉన్నాయో ఈ ఘటన అద్దం పడుతుందని విమర్శించారు. అసలు 108 అంబులెన్స్ సర్వీసులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 108 సేవలను పటిష్టం చేయాలని ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణలో రాజన్య రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని షర్మిల ఈ సందర్భంగా మరోసారి వెల్లడించారు.