విద్యుత్ ఒప్పందాల కోసం ఏపీ మాజీ సీఎం జగన్ కు వ్యాపార దిగ్గజం అదానీ 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపణలు రావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్-అదానీ ఒప్పందంపై ఏసీబీ అధికారులకు షర్మిల ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏసీబీకి షర్మిల కంప్లయింట్ ఇచ్చారు. ఆ స్కామ్ లో నిజాలు నిగ్గు తేల్చాలని, ఏపీలో అవినీతి జరిగితే అమెరికా లో బయట పడిందని చెప్పారు. 2021లో అదానీ – జగన్కు మధ్య సోలార్ పవర్ డీల్ కుదిరిందని ఆధారాలతో సహా అమెరికాలో చార్జిషీట్ ఫైల్ అయిందని, విచారణ కూడా మొదలుపెడుతున్నారని షర్మిల చెప్పారు. ఆ అవినీతిని బయటపెట్టే సంస్థలు ఏపీలో లేవా అని ప్రశ్నించారు.
అంతేకాదు, ఆ విద్యుత్ కుంభకోణంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. 1300 పేజీలతో కూడిన సాక్ష్యాలు సమర్పించారని అన్నారు. జగన్, అదానీల ఒప్పందం వల్ల ఏపీ ప్రజలు నష్టపోయారని చెప్పారు. 1.99 పైసలకే యూనిట్ విద్యుత్ దొరుకుతుంటే జగన్ 2.49 కి కొన్నారని విమర్శించారు. అది కూడా 25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. జగన్ అవినీతి అక్రమాలు తెలిసే వైసీపీని ప్రజలు ఓడించి కూటమిని గెలిపించారని చెప్పారు. ఏసీపీ పారదర్శకంగా అదానీ-జగన్ ఒప్పందంపై విచారణ జరిపేలా సీఎం చంద్రబాబు ఆదేశించాలని కోరారు. ఈ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు.