ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గతంలో ఎపుడూ లేనంతగా దళితులపై దాడులు జరుగుతున్నాయి. గతంలో వెలుగుచూసిన అనేక సంఘటనల్లో అధికార పార్టీ నేతల ప్రాబల్యం ఉండేది కాదు. కేవలం ఆయా స్థానిక దురహంకారాలు మాత్రమే కనిపించేవి. కానీ జగన్ సర్కారు హయాంలో అధికార పార్టీ నేతలు, చివరకు పోలీసులు కూడా దళితులపై దాడికి పాల్పడిన సంఘటనలు నమోదయ్యాయి.
ఒక పోలీసు స్టేషన్లో దళితుడికి గుండు కొట్టించిన సంఘటనతో దేశం విస్తుపోయింది. ఇది రాష్ట్రపతి భవన్ దాకా చేరడంతో అక్కడి నుంచి దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాతా అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు సోనుసూద్ ఒక దళితుడికి సాయం అందిస్తే దానిని కూడా అడ్డుకున్నంత పనిచేశారు. మరో చోట జగన్ ను విమర్శించినందుకు పెద్ద ఎత్తున బెదిరింపు కాల్స్ రావడంతో దళితుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరోచోట దళిత మహిళపై అఘాయిత్యం. ఒకటా రెండా… లెక్కలేనన్ని ఘటనలు రాయాలంటే పేజీలు పేజీలు నిండిపోతాయి. అయితే, అదేదో కొందరు బుద్ధిత క్కువ వాళ్లు చేస్తే పార్టీ మీద నిందలు వేస్తారా అని సమర్థించుకున్నారు పలువురు వైసీపీ నేతలు. అయితే, తాజాగా స్వయంగా జగన్ సమక్షంలో దళితుడు అగౌరవానికి గురయ్యారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరైన సంద్భంగా సీఎం జగన్ రెడ్డి, కర్ణాటక సీఎం యడ్యూరప్ప, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి, టీటీడీ ఈవో సుబ్బారెడ్డి కుర్చీల్లో ఆసీనులు కాగా, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి కంటే ప్రొటోకాల్ పరంగా పెద్ద స్థానంలో ఉన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామిని కార్యక్రమం మొత్తం నిలబెట్టారు. వయసుకు, కులానికి, చివరకు ప్రొటోకాల్ కి కూడా గౌరవం ఇవ్వలేదు.
దీన్ని బట్టి ఏపీలో మంత్రి పదవులు, హోదాలు దళితులకు ఇచ్చినా అధికారం మాత్రం కొందరి చేతిలోనే ఉందని స్వయంగా సీఎం నిరూపించినట్లయ్యింది. మతం ముసుగులో దళితుల ఓట్లను గంపగుత్తుగా పొందిన వైకాపా అధ్యక్షుడు జగన్ రెడ్డి.. దళిత నాయకుల విషయంలో కనీస ప్రోటోకాల్ పాటించకుండా ఉపముఖ్యమంత్రిని వెనుక వరుసలో నిల్చోబెట్టడంపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జగన్ రెడ్డీ… నువ్వు దళితులపై ప్రేమ చూపకపోతే పాయె… కానీ గౌరవం ఇవ్వండి చాలు అంటున్నారు విమర్శకులు. రెడ్డి గార్లు సింహాసనాల మీద…మరి దళితులు.. నిలువు కాళ్ల మీదనా సీఎం సార్ అంటూ వాపోతున్నారు విమర్శకులు.
దళిత ఎంపీ కుటుంబానికి పరామర్శ కూడా లేదా !మరో విషాదకరమైన పరిణామం ఏంటంటే… ఏపీలో అధికార పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ మృతిచెందారు. ఆయన మరణించి వారం అయ్యింది. కానీ కరోనాను లెక్కచేయకుండా అందరిత మాస్కులు తీయించే జగన్ రెడ్డి అపుడు పరామర్శకు రాలేదు. తాజాగా తిరుపతికి వచ్చిన సందర్భంలో కూడా తిరుగుపయనంలో దళిత ఎంపీ కుటుంబాన్ని పరామర్శించలేదు. దీనిపై టీడీపీ నేత దేవతోటి నాగరాజు స్పందిస్తూ… తిరుపతికి వెళ్లినా సొంత పార్టీ ఎంపీ కుటుంబాన్ని పరామర్శించలేని జగన్ రెడ్డి.. హైదరాబాద్ కు ప్రత్యేకంగా వచ్చి మామను పరామర్శించి వెళ్లారు. ఇది జగన్ రెడ్డి దళితులకు ఇచ్చే గౌవరం అని విమర్శించారు.