నరసాపురంలో ఏం జరుగుతుంది? వైసీపీ గెలుస్తుందా? రఘురామరాజు ఓడిపోతాడా? ఇదీ.. ఇప్పుడు ఏ ఇద్దరు రాజకీయ నేతలు కలుసుకున్నా జరుగుతున్న చర్చ. దీనికి కారణం… 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న కనుమూరి రఘురామకృష్ణరాజు.. తర్వాత.. కొన్ని నెలలకే రెబల్ గా మారిపోయారు.
కారణాలు ఏవైనా.. ఆయన సొంతపార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. చివరకు సొంత పార్టీ అధినేత జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటూ.. కోర్టుకు కూడా ఎక్కారు. ప్రస్తుతం ఇది తెలంగాణ హైకోర్టు విచారణలో ఉంది.
అయితే.. ఇదే సమయంలో ఏకు మేకుగా మారారంటూ.. రఘురామపై వైసీపీ కూడా కన్నెర్ర చేసింది. అయితే.. నేరుగా ఆయననే ఏమీ అనకుండా.. ఆయన పార్లమెంటు అభ్యర్థిత్వంపై వేటు వేయాలని.. పార్లమెంటు స్పీకర్‌కు ఇప్పటికే విన్నవించారు. దీనిపై చర్యలకు కూడా వైసీపీ ఎంపీలు తీవ్రస్తాయిలో పట్టుబడుతున్నారు.
అయితే.. ఇప్పటికీ.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల రఘురామే.. స్పందిస్తూ.. త్వరలోనే తాను రాజీనామా చేస్తానని.. ఈలోగా.. తనను అనర్హుడిని చేయాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. ఫిబ్రవరి 5న ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అయితే.. ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున ఈ సమావేశాలు అయ్యాక ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇదిలావుంటే.. రఘురామ కనుక తన పదవికి రాజీనామా చేస్తే.. షెడ్యూల్ ప్రకారం ఆరు మాసాల్లో తిరిగి ఎన్నికలు నిర్వహించాలి. దీంతో వచ్చే సెప్టెంబరు లోగానే నరసాపురం ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరు విజయం సాధిస్తారు? అనేది ఆసక్తికర చర్చగా మారింది.
ఇప్పటి వరకు ఉన్న అంచనాలు.. నేతల మధ్య జరుగుతున్న చర్చను బట్టి.. రఘురామ విషయంలో క్లారిటీ వస్తే తప్ప.. దీనిపై ఎలాంటి నిర్ణయానికీ రాలేని పరిస్థితి వుందని అంటున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో జగన్ సునామీ.. రఘురామరాజు సొంత సత్తా రెండూ కలిపి ఆయన విజయం దక్కించుకున్నారు.
మరి ఈ దఫా.. ఆయన ఒంటరిగా బరిలోకి దిగుతారా (సంతంత్య్ర అభ్యర్థిగా) లేక.. బీజేపీ తరఫున పోటీ చేస్తారా? లేక జనసేన తరఫున పోటీ చేస్తారా? ఇవన్నీ పక్కన పెట్టి టీడీపీ టికెట్‌పై నిలబడతారా? అనేది ఆసక్తిగా మారింది. వీటిలో ఏ పార్టీ తరఫున ఆయన పోటీ చేసినా.. వైసీపీ బలంగా ఢీ కొనే అవకాశం ఉంది. అలా కాకుండా.. అన్ని పార్టీలూ ఏకమై.. రఘురామకు మద్దతుగా నిలిస్తేనే .. వైసీపీ కి బ్యాండ్ తప్పదు.
వాస్తవానికి గత 2019 ఎన్నికల్లో 35 వేల ఓట్లు సంపాయించుకున్న రఘురామ.. గట్టి పోటీనే ఎదుర్కొన్నారు. ముఖ్యంగా జనసేన అభ్యర్థి నాగబాబు బలమైన పోటీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందనేది వైసీపీయేతర పార్టీలు తీసుకునే నిర్ణయంపైనే రఘురామ భవితవ్యం ఆధారపడి ఉంది.
అదేసమయంలో ఈ ఎన్నికలు ప్రభుత్వానికి కూడా అగ్ని పరీక్షగా మారనున్నాయనేది వాస్తవమే. రెండున్నరేళ్ల పాలన తర్వాత.. అనేక పథకాలను ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక.. అందునా.. పార్లమెంటుస్థాయి ఉప ఎన్నిక కావడం..ఎలాంటి సెంటిమెంటుకు అవకాశం లేకపోవడంతో.. వైసీపీకి కూడా ప్రతిష్టాత్మకమే. మరి ఏం జరుగుతుందో చూడాలి.