పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీనియర్ పొలిటిషియన్, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పలు మార్లు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పోలవరంపై, గోదావరిపై తెలంగాణ కడుతున్న ప్రాజెక్టుల నేపథ్యంలో సీఎం జగన్ పై ఉండవల్లి గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ పలు ప్రాజెక్టులు కడుతున్నా జగన్ నోరు మెదపడం లేదని ఉండవల్లి పలుమార్లు ఆరోపించారు.
జగన్, వైసీపీ నేతల ఆస్తులన్నీ పక్క రాష్ట్రంలోనే ఉన్నాయని, అందుకే ఆ ప్రాజెక్టులపై మాట్లాడటానికి జగన్ భయపడుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ ప్రాజెక్టులపై నోరెత్తితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారని ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు గతంలో పెనుదుమారం రేపాయి. రిజర్వాయర్ నిర్మాణానికి పోలవరం ముంపు ప్రాంత ప్రజలకు పునరావాస పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని, ఈ విషయంలో కేంద్రాన్ని జగన్ గట్టిగా నిలదీయ లేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
డీపీఆర్ ప్రకారం పూర్తిస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పెట్టాల్సిందేనని, లేదంటే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉండవల్లి హెచ్చరించారు. కేసీఆర్ మాటలు విని భయపడితే లాభం లేదని, పోలవరం పూర్తయ్యేవరకూ తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పాలని జగన్ కు సూచించారు. పోలవరం ప్రాజెక్టులో 41 మీటర్ల వరకే నీటిని నిల్వ చేయాలనే ఆలోచన మానుకోవాలని, అలా చేస్తే పోలవరాన్ని ఎవరూ పట్టించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పోలవరం విషయంలో ఉండవల్లి మరోసారి స్పందించారు. విభజన చట్టం కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడాన్ని ఆయన స్వాగతించారు. దానివల్ల ఏపీకి మంచి జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేకహోదా సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపరిచిందని చెప్పారు. ఇలా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని గతంలో చంద్రబాబుకు చెప్పానని, ఇపుడు జగన్ ఆ పని చేశాడని అన్నారు.