దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది భారతీయ ఓటర్ల ఓటు వేయడం ప్రపంచ రికార్డు అని, దీంతో భారత్ చరిత్ర సృష్టించిందని అన్నారు.
జీ7 దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రేట్లు అధికం అని రాజీవ్ కుమార్ అన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని వెల్లడించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 39 చోట్ల మాత్రమే రీపోలింగ్ జరిగిందని, 2019లో 540 చోట్ల రీపోలింగ్ జరిగిందని గుర్తు చేశారు. గత నాలుగు దశాబ్ధాల్లో ఎన్నడూ లేని స్థాయిలో లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌లో అధిక స్థాయిలో ఓటర్లు ఓటు వేసినట్లు స్పష్టం చేశారు. హింస లేకుండా జనరల్ ఎలక్షన్స్ జరగడం ఇదే మొదటిసారి అని తెలిపారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 68 వేల మానిటరింగ్ బృందాలు, 1.5 కోట్ల పోలింగ్, భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తించినట్లు వెల్లడించారు. 2024 ఎన్నికల నిర్వహణ కోసం సుమారు నాలుగు లక్షల వాహనాలు, 135 ప్రత్యేక రైళ్లు, 1,692 విమాన సర్వీసులను ఉపయోగించామని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ పది వేల కోట్ల నగదును సీజ్ చేశామని, డ్రగ్స్, భారీ మొత్తంలో మద్యాన్ని కూడా సీజ్ చేశామని, ఎన్నికల నియమావళి ఉల్లంఘించినట్లు 495 ఫిర్యాదులు రాగా, వాటిలో 90 శాతం తక్షణమే పరిష్కరించినట్లు రాజీవ్ కుమార్ చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అనేక మంది అగ్ర నేతల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, డీప్ ఫేక్, ఏఐ ఆధారిత కాంటెంట్‌ను చాలా వరకు నియంత్రించినట్లు తెలిపారు.