నెడుముడి వేణు.. మన వాళ్లకు ఈ పేరు అంతగా పరిచయం లేకపోవచ్చు. ఐతే ఇండియాలో ఇతర భాషల సినిమాలను కూడా ఫాలో అయ్యేవారికి నెడుముడి వేణు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల్లో ఆయనొకరు.
500కు పైగా సినిమాల్లో నటించడమే కాదు.. మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న నటుడాయన. 73 ఏళ్ల ఈ లెజెండరీ యాక్టర్ సోమవారం కన్నుమూశారు. ఆరోగ్యం సహకరించని చివరి రోజుల్లోనూ నటనకే తన జీవితాన్ని అంకితం చేసిన కమిట్మెంట్ ఆయన సొంతం.
చివరగా ఆయన నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారమైన మణిరత్నం ఆంథాలజీ ఫిలిం ‘నవరస’లో నటించారు. అందులో ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ‘సమ్మర్ ఆఫ్ 1992’ అనే ఫన్నీ ఎపిసోడ్లో కీలక పాత్ర పోషించారు. ఇది కాక నెడుముడి వేణును డబ్బింగ్ సినిమాలు చాలా వాటిలోనే తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు.
రెండు దశాబ్దాల కిందట బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన శంకర్-కమల్ హాసన్ సినిమా ‘భారతీయుడు’లో నిజాయితీ కలిగిన పోలీస్ ఉన్నతాధికారిగా నెడుముడి వేణు చేసిన పాత్రను అంత సులువుగా మరిచిపోలేం. అలాగే ‘అపరిచితుడు’లో హీరో తండ్రి పాత్రలోనూ ఆయన మెరిశారు.
మలయాళ చిత్రాల్లో కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ రోల్స్‌తో తిరుగులేని హవా సాగించారాయన. మన దగ్గర కోట శ్రీనివాసరావు లాగా ఆయన ప్రతి పేరున్న సినిమాలోనూ కనిపించేవారు. పెద్దగా హడావుడి చేయకుండా సింపుల్‌గా, సటిల్‌గా తన పాత్రలను పండించడంలో నెడుముడి వేణుది అందెవేసిన చేయి.
మూడుసార్లు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్న వేణు.. ఆరుసార్లు కేరళ రాష్ట్ర అవార్డులు గెలిచారు. ఆయన ‘చౌరాహెన్’ అనే ఇంగ్లిష్ మూవీలోనూ నటించారు. కొన్ని నెలల కిందట వేణు కరోనా బారిన పడ్డారు.కరోనా నుంచి కోలుకున్నప్పటికీ.. దాని దుష్ప్రభావాలు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో చివరికి ప్రాణాలు విడిచారు.