వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు, ఆ పార్టీ నేతలకు ఎంపీ రఘురామకృష్ణరాజు చాలాకాలంగా కొరకరాని కొయ్యగా మారిన సంగతి తెలిసిందే. జగన్ పాలనను, వైసీపీ నేతల తీరును ఎండగడుతున్న రఘురామపై వైసీపీ నేతలంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు రఘురామపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు చెప్పినా….ఆ దిశగా అడుగులు పడలేదు. ఇక, జగన్ బెయిల్ రద్దు కోసం రఘురామ వేసిన పిటిషన్ కూడా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ క్రమంలోనే తాజాగా లోక్ సభలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, ఎంపీ మిథున్ రెడ్డిల మధ్య పార్లమెంటు సాక్షిగా మాటల తూటాలు పేలాయి. అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పిస్తున్నారంటూ జీరో అవర్ లో రఘురామ ఆరోపించారు. గాంధేయ మార్గంలో పాదయాత్ర చేస్తున్న వారిని అడ్డుకోవడం సరికాదని పార్లమెంటు సాక్షిగా గళం విప్పారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ వారిని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.
అమరావతి రాజధాని కోసం 33 వేల ఎకరాలిచ్చిన రైతుల పట్ల ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని సభలో వెల్లడించారు. అయితే, ఈ క్రమంలోనే రఘురామ ప్రసంగానికి వైసీపీ ఎంపీలు అడ్డుతగిలారు. రఘురాజుపై సీబీఐ కేసులున్నాయని, వాటి నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు రఘురామ తహతహలాడుతున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు.
అంతేకాదు, రఘురామ సీబీఐ కేసులపై విచారణ వేగవంతం చేయాలని కోరారు. అయితే, తనపై 2 సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని, జగన్ పై వంద సీబీఐ కేసులున్నాయని సభలో రఘురామ వెల్లడించారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విచారణను ముందు తేల్చాలని డిమాండ్ చేశారు. రఘురామ ఇచ్చిన కౌంటర్ తో మిథున్ రెడ్డి సైలెంట్ అయ్యారు.