‘పిల్ల బాయిలో పడిందంటే అంబలి తాగి వస్తానన్నాడట’ అని సామెత తెలిసిందే. అదే రీతిలో ఆపరేషన్ ఆపి ‘మసాలా దోశ’ తినొస్తా అన్న ఓ డాక్టర్ ఉదంతం ఉత్తర ప్రదేశ్ లో సంచలనం రేపింది. అయితే వైద్య వృత్తిని మనం ఎంతో గౌరవిస్తాం. వైద్యులను దేవుళ్లతో సమానంగా కొలుచుకుంటాం. కానీ వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీలో జిల్లా నవాబాద్ ప్రాంతానికి చెందిన కాజల్ శర్మ అనే బాలిక గతేడాది డిసెంబర్ 22న ఇంట్లో కిందపడిపోయింది. దీంతో ఎడమ మోచేతి వెనుక విరిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటీన సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన ఓ ఆర్థోపెడిక్ సర్జన్ బాలిక చేతికి సర్జరీ చేయాలని సూచించాడు. అదేరోజు శస్త్రచికిత్స చేసేందుకు బాలికను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్ మొదలు పెట్టిన కాసేపటికే ఆకలిగా ఉందని, మసాలా దోశ తిని వచ్చి సర్జరీ పూర్తి చేస్తానని చెప్పి వైద్యుడు మధ్యలోనే వెళ్లిపోయాడు.
ఆ తర్వాత తీరిగ్గా 2 గంటల తర్వాత తిరిగి వచ్చి ఆపరేషన్ పూర్తి చేశాడు. అయినప్పటికీ బాలిక చెయ్యి నయం కాలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మళ్లీ ఆ వైద్యుడిని కలిసేందుకు ఆసుపత్రికి వస్తే కనీసం వారిని కలిసేందుకు కూడా నిరాకరించాడు. దీంతో వారు అనివార్య పరిస్థితుల్లో ఆ బాలికకు మరో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి కొందరు వైద్యుల మూలంగా ప్రజలకు ఆసుపత్రులు, వైద్యుల మీద నమ్మకం కోల్పోతున్నారు.