అమరావతిపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని అని, ఆరు నెలలలోపు అమరావతిలో అభివృద్ధి పనులు చేపట్టి వాటికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఏపీ హైకోర్టు కొద్ది నెలల క్రితం సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆరు నెలల్లో తాము ఆ పని చేయలేము అని, తమవల్ల కాదని ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. అంతేకాదు, అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ లో తమను ఇంప్లీడ్ చేయాలంటూ అమరావతి రాజధానికి చెందిన రైతులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్లన్నింటిని కలిపి త్వరలోనే విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని తాను వ్యతిరేకించానని, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన తొలి వ్యక్తిని తానేనని ఉండవల్లి అన్నారు.
ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందా మూడు రాజధానులు వస్తాయా అన్న సంగతి తనకు తెలియదని, ఆ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. తనతో పాటు మరి కొంత మంది నేతలు కూడా అమరావతి రాజధానికి గతంలోనే వ్యతిరేకంగా ఉన్నారని, కొంతమంది రైతులు కూడా అమరావతిలో రాజధానిపై విముఖత వ్యక్తం చేశారని ఉండవల్లి గుర్తు చేశారు.
అయితే, అమరావతికి జగన్ కూడా మద్దతు తెలపడంతోనే అక్కడి రైతులు ధైర్యంగా తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చారని ఉండవల్లి కుండ బద్దలు కొట్టారు. జగన్ అమరావతికి జై కొట్టిన తర్వాతే 33 వేల ఎకరాల భూసేకరణ జరిగిందన్న ఉద్దేశంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. అప్పుడు అమరావతికి ఓకే అన్న జగన్…ఇపుడు నో అంటున్నారని జగన్ అసలు రంగును ఉండవల్లి బయటపెట్టేలా ఉండవల్లి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.