ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును నిండు శాసనసభలో ఘోరంగా అవమానించిన ఘటన పెనుదుమారం రేపుతోంది. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరిపై కూడా వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు మనస్తాపానికి గురైన ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
చంద్రబాబుకు, ఆయన సతీమణి భువనేశ్వరికి జరిగిన అవమానానికి మనస్తాపం చెంది అనంతపురంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆత్మహత్యకు ప్రయత్నించారు. టీడీపీ కార్యకర్తలు బంగినాథ, విశ్వేశ్వరనాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వారి పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్భవన్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు పై వ్యాఖ్యలకు నిరసనగా సీఎం జగన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకుతెలుగు యువత కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. జగన్కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు
మరోవైపు, కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వైసీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. చంద్రబాబును అవమానించిన ఘటనకు నిరసనగా టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. అంతేకాదు, చంద్రబాబుకు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకాలని టీడీపీ నేతలు…. ప్రజలకు పిలుపునిచ్చారు.
కాగా, ప్రెస్ మీట్ అనంతరం చంద్రబాబు హైదరాబాద్ కు వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబుతోపాటు లోకేష్ కూడా హైదరాబాద్ వెళ్లారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర భారీగా టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. మోకాళ్లపై కూర్చుని అంతా చంద్రబాబు వెంట ఉంటామంటూ యువకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.