వైసీపీకి ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్ర చరిత్రలో ఏ పార్టీకి రానన్ని సీట్లు వచ్చాయని వైసీపీ నేతలు గొప్పలు చెబుతుంటారు. అంతేకాదు, జగన్ తరహా పాలన మరే ముఖ్యమంత్రి అందించలేదని…అందించలేరని కూడా డబ్బా కొడుతుంటారు. జగన్ కు అత్యంత ప్రజాదరణ ఉందని, ఆయన ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారని ఆకాశానికెత్తేస్తుంటారు. అయితే, ఇంత ప్రజాదరణ ఉన్న సీఎం..జనం మధ్యలో తిరిగేందుకు భయపడడంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
పర్యటనల సందర్భంగా జనానికి జగన్ కు మధ్య బారికేడ్లు ఉంటాయని, వాస్తవంగా కూడా జగన్ కు, జనానికి మధ్య అంత గ్యాప్ ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. జనాదరణ ఉన్న జగన్ జనం మధ్య కలియదిరిగేందుకు ఎందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేస్తూ జనాలతో మమేకమైన జగన్…సీఎం అయిన తర్వాత మాత్రం జనాన్ని కరోనా బాధితులను చూసినట్లుగా చూస్తున్నారని విమర్శిస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా నేడు కుప్పంలో జగన్ పర్యటన సందర్భంగా కూడా జగన్ కు జనానికి మధ్య బారికేడ్లు పెట్టారు. వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు బదిలీ కార్యక్రమాన్ని కుప్పంలో పెట్టిన జగన్… పట్టణంలోని కొన్ని రోడ్లను బ్లాక్ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇలా భారీ బందోబస్తుతో జగన్ దర్శనమివ్వడంపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
ఒక్క బటన్ నొక్కడానికి మూడు వరుసల బ్యారికేడ్లు అవసరమా? అంటూ మనోహర్ ఎద్దేవా చేశారు. తన పర్యటన కోసం మూడు వేల మంది పోలీసులు, మూడు వేల బస్సులు ఉండాలా ముఖ్యమంత్రి గారూ? అంటూ ఎద్దేవా చేశారు. రోడ్లు వేయడం చేతగాని జగన్ సర్కార్… రోడ్లు తవ్వేసి బ్యారికేడ్లు వేయిస్తోందని చురకలంటించారు.