పాలనా రాజధాని అంటూ విశాఖను ఎంచుకున్న జగన్…అక్కడ వేల కోట్ల రూపాయల విలువైన స్థలాలు, భూములు అప్పణంగా దోచుకునేందుకు విజయసాయిని గతంలో ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా నియమించారని విమర్శలు వచ్చాయి. జగన్ అండతో రెచ్చిపోయిన సాయిరెడ్డి…విశాఖలో భూ ధందాకు తెరతీశారని టీడీపీ నేతలు పలుమార్లు దుయ్యబట్టారు. ఆ కోవలోనే విశాఖలోని రుషికొండ హరిత రిసార్ట్స్ వద్ద పర్యాటక ప్రాజెక్ట్ పేరుతో వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శలు వచ్చాయి.
అంతేకాదు, రిషికొండ పరిధిలో ఉన్న పాత రిసార్ట్‌ను పూర్తిగా కూల్చేసిన జగన్ సర్కార్ అక్కడే దానిని మరింతగా విస్తరిస్తూ కొత్త రిసార్ట్‌ను కడుతుండడంపై విమర్శలు వచ్చాయి. ఈ పనుల వల్ల పర్యావరణం దెబ్బ తింటోందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించారు. దీంతో, ఆ కొత్త రిసార్ట్ పనులు నిలిపివేయాలంటూ ఎన్జీటీ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రుషికొండ వద్ద నిర్మాణాలు పరిశీలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లగా…చంద్రబాబును, టీడీపీ నేతలను ఎండాడ జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నిర్మాణాలను సందర్శించేందుకు వెళుతున్న తనను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని చంద్రబాబు ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వం చేపట్టింది పర్యాటక ప్రాజెక్టే అయితే, దానికి అన్ని అనుమతులు ఉంటే అంత ఉలికిపాటు ఎందుకని జగన్ ను చంద్రబాబు నిలదీశారు.
ఈ క్రమంలోనే కొత్త రిసార్ట్‌కు సంబంధించి జగన్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాకిచ్చింది. రిషికొండ రిసార్ట్ విస్తరణకు అనుమతి లేదని దేశపు సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేకాదు, రిషికొండ తవ్వకాలపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వానికి ధర్మాసనం సూచించింది. హైకోర్టులో తేలేంతవరకు ఇకపై కొత్త తవ్వకాలు చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. దీంతో, సుప్రీంకోర్టులో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
అయితే, ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసి సవాల్ చేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం…ఎన్జీటీ పరిధిపై విస్మయం వ్యక్తం చేసింది. ఎన్జీటీ జారీ చేసిన తీర్పు కాపీ ఉందా? అని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. అందుకోసం సమయం కావాలని ఏపీ తరఫు న్యాయవాది కోరడంతో విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రిషికొండలో కొత్త రిసార్ట్ వల్ల పర్యావరణానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.