రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి సోదరులది ప్రత్యేక ప్రస్థానం. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ బ్రదర్స్‌కు గొప్ప పట్టుంది. అందుకే ప్రస్తుతం ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మారిన పరిస్థితుల కారణంగా ఆ పార్టీని వీడేందుకు ఈ సోదరులు సిద్ధమయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హస్తాన్ని వీడి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టత కూడా ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు.
కేసీఆర్‌పై పోరాటం చేసే పార్టీలోకి వెళ్తామని రాజగోపాల్‌రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీనే సీఎం కేసీఆర్‌పై పోరు కొనసాగిస్తోంది. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో ప్రధాని మోడీని కలవడం కూడా ఈ సోదరులు బీజేపీలో చేరతారనే ప్రచారానికి బలాన్ని చేకూర్చింది. తమకు వ్యక్తిగత గుర్తింపు ఉండాలన్నది కోమటిరెడ్డి బ్రదర్స్ మెయిన్ డిమాండ్. అందుకోసమే ఇద్దరూ ఢిల్లీ స్థాయి నేతలతోనే టచ్‌లో ఉంటున్నారు.
గతంలో రాజగోపాల్‌రెడ్డి ఎంపీగా గెలిచి ఢిల్లీలో కాస్తో కూస్తో పట్టు సాధించుకున్నారు. గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బీజేపీ కేంద్ర పెద్దలతో పదే పదే కలుస్తూ ఫ్రెండ్లీ రిలేషన్ మెయిన్‌టెన్ చేస్తున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఇద్దరిలో కమలం కండువా కప్పుకోవాలనే ఆలోచన బలంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం కోమటిరెడ్డి సోదరుల ఎంట్రీకి అడ్డుపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అందుకే వాళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కోమటిరెడ్డి సోదరుల రాజకీయ వ్యూహాలు ఢిల్లీ స్థాయిలో ఉండడంతో తెలంగాణ బీజేపీ అగ్రనేతలకు అది మింగుడు పడడం లేదని తెలుస్తోంది. ఆ సోదరులకు ఉన్న పరిచయం, ఫాలోయింగ్‌తో ప్రతి విషయానికి నేరుగా బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లగలరని అంటున్నారు. ఇలా అయితే ఇక తమకు ఏం గుర్తింపు ఉంటుందనే ఆలోచనతో రాష్ట్ర నేతలు ఉన్నారని సమాచారం. అందుకే ఎలాగైనా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీలో చేరకుండా తెరవెనక గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచినా తమను పట్టించుకోని కాంగ్రెస్‌ని విడిచిపెడదామనుకుంటే..బీజేపీలో చేరక ముందే కోమటిరెడ్డి సోదరులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.