ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు కావాలని చేస్తున్నారో..కాంట్రవర్సీ అవుతుందని తెలియక చేస్తున్నారో తెలీదుగానీ…అత్యంత సున్నితమైన విషయాలకు సంబంధించిన చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న కాళీ మాత సిగరెట్ తాగుతున్నట్లుగా తన పిచ్చి క్రియేటివిటీని చూపించి వివాదంలో చిక్కుకుందో తమిళ దర్శకురాలు. ఇక, తాజాగా టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి కూడా అదే తరహాలో ఓ వివాదానికి కేంద్ర బిందువైంది.
అన్నమయ్య రాసిన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ కీర్తనను శ్రావణ భార్గవి తన అందచందాలను చూపిస్తూ చిత్రీకరించడం వివాదాస్పదమైంది. తన చీరకట్టును చూపిస్తూ తనను అందంగా చిత్రీకరించుకున్న ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్లో ఆమె పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఆ వీడియో చూసిన అన్నమయ్య కుటుంబ సభ్యులు శ్రావణ భార్గవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోపై నెటిజన్లు ట్రోలింగ్ చేయడంతో ఆమె ఏకంగా కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక, ఆ వీడియోపై అన్నమయ్య వంశస్థులు స్పందించారు. స్వామివారికి అభిషేకం చేస్తూ కీర్తించిన పాటకు ఆమె కాళ్లు ఊపుతూ, తన అందాన్ని వివిధ భంగిమల్లో చూపించడం ఏమిటని మండిపడ్డారు. అంతేకాదు, ఆ వీడియో తొలగించాలంటూ శ్రావణ భార్గవికి తాము ఫోన్ చేస్తే ఆమె చాలా బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పాటూ చాలా మంది ఆ పాటను తొలగించమని కోరినా ఫలితం లేదని అన్నమయ్య వంశస్థుల్లో ఒకరైన తాళ్లపాక వెంకటరాఘవ అన్నమాచార్యులు చెబుతున్నారు.
వేంకటేశ్వరస్వామి వారికి మాత్రమే పాడే ఆ కీర్తనను శ్రావణ భార్గవి తనను తాను అందంగా చూపించుకోవడం కోసం వాడడం భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పాటను రెండు రోజుల క్రితమే యూట్యూబ్ లో పోస్టు చేయగా..దాదాపు 7 లక్షల వ్యూస్ వచ్చాయి. మరి, ఈ క్రమంలో శ్రావణ భార్గవి ఆ వీడియోను తొలగిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక, ఇటీవల తన భర్త సింగర్ హేమ చంద్రతో శ్రావణ భార్గవి విడాకులు తీసుకోబోందన్న పుకార్లు రావడం..వాటిని హేమచంద్ర ఖండించడం తెలిసిందే.