సైఫ్ అలీఖాన్. బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరు. పరిచయం చేయాల్సిన అవసరం లేని సెలబ్రిటీ. ఆయనకు ఉండే సంపద.. కార్ల సంఖ్య గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదనుకుంటాం. కానీ.. కొన్నిసార్లు ఎదురయ్యే పరిస్థితి తెలిసినప్పుడు ఔరా అని ముక్కున వేలేసుకోవాల్సిందే. తన ఇంట్లో కత్తిపోట్లకు గురై.. తీవ్రంగా గాయపడిన వేళ.. ఇంట్లో ఒక్క కారు కూడా అందుబాటులో లేకపోవటానికి మించిన షాకింగ్ అంశం ఏం ఉంటుంది? కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి.. రక్తం ధారలుగా కారుతున్న వేళ.. ఆసుపత్రికి వెళ్లేందుకు ఇంట్లో ఏ కారు లేకపోవటంతో.. సైఫ్ కొడుకు ఆటోలో తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
సైఫ్ ను ఆసుపత్రిలో ఆటోలో తరలించిన ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానాను మీడియా గుర్తించింది. అతడ్ని కలిసి.. ఆ రోజు ఏం జరిగింది? అన్న విషయాన్ని అడిగినప్పుడు ఆసక్తికర విషయాల్ని వెల్లడించాడు. ఆ రోజు ఏం జరిగిందో చెబుతూ.. సైఫ్ అలీ ఖాన్ నిబ్బరాన్ని అభినందించాడు. అంత గాయాల బారిన పడినప్పటికి ఏ మాత్రం ఆందోళనకు గురి కాకుండా ఉన్నట్లుగా వ్యవహరించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇంతకూ ఆ రోజు ఏం జరిగింది?అన్న విషయాన్ని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ మాటల్లో.. ‘‘నేను ఆటోలో ఆ వైపు నుంచి వెళుతున్నా. ఒక గేటు వద్ద నుంచి కేకలు వినిపించాయి. ఒక మహిళ మొయిన్ గేట్ దగ్గరకు వచ్చి సాయం చేయాలని అరుస్తోంది. ఆటోను ఆపని కోరటంతో ఆపాను. అయితే.. బయటకు వచ్చేది సైఫ్ అలీఖాన్ అని తెలీదు. ఏదో చిన్న దాడి కేసు అనుకున్నా. సైఫ్ నడుచుకుంటూ వచ్చి తనకు తానుగా ఆటో ఎక్కారు. బాగా గాయపడిన స్థితిలో ఉన్నారు. ఆయన వెంట ఒక పిల్లవాడు.. మరో వ్యక్తి ఉన్నారు. సైఫ్ ఆటోలో కూర్చోగానే ఎంత టైం పడుతుంది (ఆసుపత్రికి చేరేందుకు) అని అడిగారు. ఎనిమిది నుంచి పది నిమిసాలు పడుతుందని చెప్పా. అన్నట్లే ఆ టైంకు ఆసుపత్రికి చేరుకున్నాం. సైఫ్ మెడ.. వీపు వెనుక నుంచి రక్తం కారుతున్న వైనాన్ని చూశా. రక్తంతో ఆయన తెల్ల కుర్తా ఎరుపు రంగులోకి మారిపోయింది. ఆసుపత్రికి చేరిన తర్వాత ఆటో ఛార్జీలు తీసుకోలేదు. సకాలంలో మనిషిని ఆదుకోవటం కంటే మంచిపని మరొకటి ఉండదు కదా’’ అంటూ తాను చూసింది.. చేసింది చెప్పుకొచ్చారు.
సైఫ్ కు చికిత్స అందించిన వైద్యులు సైతం సైఫ్ ఆత్మనిబ్బరాన్ని ప్రత్యేకంగా ప్రశంసించటం గమనార్హం. అంత రక్తం కారుతున్నా.. తీవ్ర గాయాలు అయినప్పటికీ స్ట్రైచర్ సాయం తీసుకోకుండా సింహం మాదిరి నడుచుకుంటూ ఆసుపత్రిలోకి వచ్చారని ప్రశంసించటం తెలిసిందే. తీవ్ర గాయాల నేపథ్యంలో ఆయనకు ఐదు గంటల పాటు శస్త్రచికిత్స జరిపారు. సర్జరీ అనంతరం సైఫ్ వెన్నముక నుంచి 2.5 అంగుళాల ఒక పదునైన బ్లేడ్ ను బయటకు తీయగా.. అది ఇంకో రెండు మిల్లీమీటర్లు లోతుగా దిగి ఉంటే.. చాలా తీవ్రంగా గాయపడి ఉండేవారని.. సైఫ్ చాలా లక్కీ అంటూ చెబుతున్నారు. అంత తీవ్ర గాయాలతోనూ ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా రియల్ హీరోలా వ్యవహరించారని చెప్పక తప్పదు.