వైసీపీ హయాంలో ఆ పార్టీ అండ చూసుకొని గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఆనాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గంలోని ‘మై హోం భుజా’లో ఉన్న వంశీని విజయవాడ తరలిస్తున్నారు.
ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలని కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఈ నెల 20న విచారణ జరగనుంది. ఈ లోపు పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, వంశీని ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది. అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చిన సందర్భంగా అరగంట పాటు ఆయన డ్రెస్ ఛేంజ్ అని చెప్పి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ సమయంలో వైసీపీ నేతలకు ఫోన్ చేసి తనను కాపాడాల్సిందిగా కోరారని తెలుస్తోంది. అయితే, అరగంట ఆగితే మీడియా వస్తుందని సదరు నేతలు వంశీకి చెప్పారట. ఈ లోపు పోలీసులు తలుపులు తెరవాలని, అరెస్టుకు సహకరించాలని గట్టిగా చెప్పడంతో చేసేదేమీ లేక వంశీ బయటకు వచ్చారట.