బుధవారం రాత్రి ఏలూరు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. ఏలూరు జిల్లా వట్లూరులోని ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన వివాహానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరు అయ్యారు. ఫంక్షన్ హాల్ కారిడార్ లో చింతమేని కారుకు అడ్డంగా అబ్బయ్య చౌదరి కారు పెట్టడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. అబ్బయ్య చౌదరి డ్రైవర్ పై చింతమనేని బూతుల పురాణం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడంతో.. చింతమనేనిపై విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఈ విషయంపై తాజాగా స్పందించిన చింతమనేని.. అక్కడ ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. తన కారును వెళ్లనివ్వకుండా పక్కా పథకం ప్రకారమే వైసీపీ నేతలు కారు అడ్డుపెట్టారని చెప్పారని.. సెక్యూరిటీ చెబుతున్నా వినలేదని.. అబ్బయ్య చౌదరినే దగ్గరుండి కారు అడ్డుపెట్టించారని చింతమనేని ఆరోపణలు చేశారు. తాము అయిదుగురు ఉంటే.. వాళ్లు 25 మంది ఉన్నారని.. కావాలనే వైసీపీ నేతలు తనతో గొడవ పెట్టుకోవాలని చూశారని ఎమ్మెల్యే మండిపడ్డారు.
తనపై హత్యాయత్నం చేశారని.. తన డ్రైవర్, గన్‌మెన్‌పై వైసీపీ అల్లరిమూకలు ఐరన్ రాడ్ తో దాడి చేశాయని.. గన్‌మెన్ దగ్గర గన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు యత్నించారని.. సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని చింతమనేని తెలిపారు. నియోజకవర్గంలో గొడవలు సృష్టించాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారని.. ఈ ఘటనను సీఎం, డిప్యూటీ దృష్టికి తీసుకెళ్తామని, చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని అన్నారు.