నార్త్ లో కెరీర్ స్టార్ట్ చేసి సౌత్ కి షిఫ్ట్ అయిన అందాల భామ నిధి అగర్వాల్ తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో `హరిహర వీరమల్లు` ఒకటి కాగా.. మరొకటి `ది రాజా సాబ్`. హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. రాజ్ సాబ్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి.
అయితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్ లపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. పవర్ స్టార్ గురించి నిధి మాట్లాడుతూ.. `పవన్ కళ్యాణ్ గారు సెట్స్ లో ఉన్నప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉంటారు. యాక్షన్ చెప్పగానే పాత్రలో లీనమవుతారు. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోరు. ఫోకస్ మొత్తం తన సన్నివేశంపైనే పెడతారు. ఆ లక్షణం నాకు బాగా నచ్చింది. నేను కూడా ఆ లక్షణాన్ని అలవాటు చేసుకుంటాను` అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ప్రభాస్ సెట్స్ లో ఎప్పుడూ ఫన్నీగా ఉంటారని నిధి తెలిపింది. ప్రభాస్, పవన్ ఇద్దరూ తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది. అప్ కమ్మింగ్ మూవీస్ గురించి మాట్లాడుతూ.. గతంలో తనకు హారర్ చిత్రాలంటే భయమని, అందుకే రాజా సాబ్ చేయాలనుకున్నానని నిధి తెలిపింది. ఇక హరిహర వీరమల్లులో తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకున్నానని.. ఇప్పటివరకు చేసినవాటిల్లో ఇది బెస్ట్ రోల్ అని నిధి అగర్వాల్ పేర్కొంది.