అక్కినేని అభిమానులు ఇప్పుడు గొప్ప హమ్మయ్య అనుకుంటున్నారు. ఓ పెద్ద హిట్ కోసం వాళ్ల నిరీక్షణ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. ఇటు నాగార్జున.. అటు నాగచైతన్య, అఖిల్ వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటుండం వారిని తీవ్ర వేదనకు గురి చేసింది. నాగ్ సినిమా ‘వైల్డ్ డాగ్’ మంచి టాక్ తెచ్చుకుని కూడా డిజాస్టర్ కాగా.. ‘ఘోస్ట్’ అన్ని రకాలుగా నిరాశపరిచింది.
అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో కొంచెం గాడినపడ్డట్లే కనిపించినా.. ‘ఏజెంట్’తో మళ్లీ పాతాళానికి పడిపోయాడు. నాగచైతన్య ‘థాంక్యూ’, ‘కస్టడీ’ చిత్రాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్నాడు. వేరే ఫ్యామిలీ స్టార్లు ఇంకా ఇంకా ఎదిగిపోతూ రికార్డులు బద్దలు కొడుతుంటే.. అక్కినేని హీరోల మార్కెట్ అంతకంతకూ కరిగిపోతుండడం అక్కినేని అభిమానులను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు ఒక పెద్ద హిట్ కొట్టాలని కోరుకున్నారు.
‘తండేల్’ సినిమాతో నాగచైతన్య వారి కోరిక తీర్చేశాడు. ఈ చిత్రం చైతూకు తొలి వంద కోట్ల సినిమా కాబోతోంది. ఇది అభిమానులకు అమితానందాన్నిచ్చే విషయం. సక్సెస్ కోసం వారి నిరీక్షణకు తెరపడింది. ఐతే ఇక అక్కినేని వారి కొత్త సినిమాల కబుర్ల కోసం వారి నిరీక్షణ ఎప్పడు ముగుస్తుందో చూడాలి. నాగార్జున సోలో హీరోగా సినిమానే చేయట్లేదు. కుబేర, కూలీ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నాడు కానీ.. సోలో హీరోగా మాత్రం సినిమా అనౌన్స్ చేయలేదు.
అఖిల్ కొత్త సినిమా గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చివరికి ‘వినరో భాగ్యము విష్ణు కథ’ దర్శకుడు మురళీకృష్ణతో సినిమా అన్నారు. కానీ దాని గురించి కూడా అధికారిక అప్డేట్ లేదు. ఇక రెండేళ్లకు పైగా ‘తండేల్’కే అంకితమైన చైతూ కూడా.. తర్వాతి సినిమా గురించి ఆలోచించలేదు. ఇప్పుడు తన చేతిలో ఏ సినిమా లేదు. అతను తర్వాత ఎవరితో జట్టు కడతాడన్నది ఆసక్తికరం. ‘తండేల్’ ఇచ్చిన ఉత్సాహంలో త్వరలోనే ఈ ముగ్గురు హీరోల కొత్త చిత్రాల గురించి కబుర్లు వినిపిస్తారేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.