వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరి కష్టాలు తెచ్చుకున్నారు. తాజాగా విజయవాడ పడమట పోలీసులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రాయదుర్గంలోని మై హోమ్ భుజా లో ఉన్న వంశీని పోలీసులు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడ తరలిస్తున్నారు. వైసీపీ హయాంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై జరిగిన దాడి కేసులో వల్లభనేని వంశీ తో సహా మొత్తం 88 మంది నిందితులుగా ఉన్నారు.
పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ71 గా ఉన్నారు. అయితే ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ రెండు రోజుల క్రితం సడన్ గా ఈ కేసుకు సంబంధించిన తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు. ఈ కేసుకు తనకు ఏం సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చాడు. వల్లభనేని వంశీనే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేయించి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. పైగా కోర్టుకు కూడా వంశీ అనుచరులే సత్యవర్ధన్ ను తీసుకొచ్చారు.
ఈ వ్యవహారం మొత్తంపై నిఘా పెట్టిన పోలీసులు.. సత్యవర్ధన్‌ను అదుపులోకి తీసుకుని ఆరా తీయగా అతను నిజం అంగీకరించాడు. వంశి అనుచరులే తనను కిడ్నాప్ చేసి బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ ఫిర్యాదు చేయడంతో.. విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ మరియు సిబ్బంది హైదరాబాద్ చేరుకుని వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. గోరుతో పోయే దానిని ఇలా ఫిర్యాదుదారును కిడ్నాప్ చేయించి బెదిరించి సమస్యను మరింత క్లిష్టంగా మార్చుకున్నారు వంశీ.
కాగా, 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. దాడికి పాల్పడింది అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులే అయినా.. వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఏం చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటికే 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ కోర్టులో వంశీ పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 20న ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. కానీ ఇంతలోనే వంశీ అరెస్ట్ అయ్యారు.