ప్రముఖ ఉత్తరాంధ్ర నేత, మాజీ ఎంపీ సబ్బం హరి కరోనాతో కన్నుమూశారు. 15 రోజుల క్రితం ఆయన కరోనా సోకింది. దీంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 రోజుల క్రితం కొంచెం కోలుకున్నారు. తర్వాత… మరోసారి ఆయన ఆరోగ్యం విషమించింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు.
సబ్బంహరి విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు.. రాజకీయ విశ్లేషకుడు. ఇతను వైఎస్ కు సన్నిహితుడు.
కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేశారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి 2009లో తొలిసారి గెలిచారు.
విశాఖపట్నం మేయర్గా కూడా సబ్బం హరి పనిచేశారు.
సబ్బం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సమైక్య ఉద్యమంలో పాల్గొని పోరాటం చేశారు.
2014 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫునా ఆయన పోటీ చేయలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యేగా భీమిలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
జగన్ తొలినాళ్లలో సబ్బంహరిని పార్టీలోకి ఆహ్వానించారు. అయితే వైఎస్ ఉన్నప్పటి నుంచే సబ్బంహరికి జగన్ తీరు నచ్చేది కాదు. జగన్ దురాశ వల్లే వైఎస్ కు చెడ్డ పేరు వచ్చిందని కూడా సబ్బంహరి నమ్ముతారు. అందుకే వైసీపీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
సబ్బం హరి మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, ఆపార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.