“అభివృద్ధితో.. మిగులు బడ్జెట్తో దక్కిన రాష్ట్రాన్ని ఆబగా దోచుకుతిన్నరు. ఎక్కడికక్కడ లంచాలు మింగిన్రు. ఏమీ లేని రాష్ట్రాన్ని మనకు అప్పగించిన్రు“ అంటూ.. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పాలనపైనా, ఆయనకుటుంబంపైనా నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవల్లి లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “2014లో రాష్ట్రం అవతరించే నాటికి.. మనకు మిగులు బడ్జెట్ ఉండే. ఇప్పుడు 7 లక్షల కోట్లకు చేర్చారు. ఇదేనా మీ పాలన.. ఇది కుటుంబ దోపిడీకి పరాకాష్ఠ“ అని విమర్శలు గుప్పించారు.
అదేసమయంలో అనేక అంశాలను సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఏదో వెలగబెడుతున్నామని చెబుతూ.. మిషన్ భగీరథను ప్రారంభించారని, కానీ,దీని పేరుతో 40 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ దోపిడి పాలన కారణంగా రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైందని, కాంగ్రెస్ పాలించేందుకు ఖజానాలో సొమ్ములు లేకుండా చేశారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబ పాలనకు, వారి దోపిడీకి కాదన్నారు. ఎంతో మంది రక్తం చిందించి, జైళ్లకు వెళ్లి, ప్రాణ త్యాగాలు చేసింది ఎవరి కుటుంబం కోసమో కాదన్నారు. తమను తాము పాలించుకునే,.. ప్రజా పాలన కోసమని వెల్లడించారు. ఇప్పుడు దానిని కాంగ్రెస్ పార్టీ సాకారం చేస్తోందని సీఎం చెప్పారు.
కేసీఆర్ పాలనలో ఎవరినైనా పట్టించుకున్నరా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరినీ ప్రగతి భవన్ దరిదాపుల్లోకి రాకుండా.. చేశారని, ఇప్పుడు దానిని తాము ప్రజాభవన్ చేసి.. ప్రజల కోసం అంకితం చేశామని చెప్పారు. అడవి బిడ్డల నుంచి.. నిరుద్యోగు లు, ఉద్యోగులు.. విద్యార్థులు.. ఇలా ఏ ఒక్కరి గురించి కూడా కేసీఆర్ కుటుంబ పాలన పట్టించుకోలేదన్నారు. “తన బిడ్డ కవితను ప్రజలు ఓడించినా ఎమ్మెల్సీతో ఉద్యోగం ఇచ్చారు. ఇందుకోసమే.. తెలంగాణ సాధించుకున్నది“ అని సీఎం రేవంత్ నిలదీశారు. అమరవీరుల ఆశయాలను కాంగ్రెస్ పూర్తి చేసిందని, వారి కుటుంబాలను కూడా ఆదుకున్నదని, ఇంకా ఏమైనా ఉంటే ఆదుకుంటామని చెప్పారు.
ఎన్నికల హామీలు..
వచ్చే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ప్రస్తావించారు. ఆయా హామీల్లో కొన్నింటినిఅమలు చేస్తున్నామని.. చేశామని చెప్పిన ఆయన త్వరలోనే మరిన్ని హామీలను కూడా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలిచ్చామన్నారు. త్వరలోనే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. పేదలకు, అర్హులైన వారికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను త్వరలోనే అందిస్తామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లోనూ కేసీఆర్ కుటుంబానికి, బీజేపీకి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.