ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన హరీశ్ రావు సవాలు విసరటం.. ఆ సందర్భంగా ఆయన చేపట్టిన హైడ్రామా గురించి తెలిసిందే. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హైలెట్ అయిన ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్ రియాక్టు అయ్యారు. హరీశ్ రావుతో పాటు గులాబీ పార్టీని.. గులాబీ అధినేతను చాకిరేవు పెట్టిన ఆయన.. తన మాటలతో ఉతికి ఆరేశారని చెప్పాలి.
హరీశ్ సవాల్ లోని లోపాల్ని ఎత్తి చూపుతూ.. తన పదునైన వాదనతో ఆయన సవాలు ఎపిసోడ్ ను కామెడీ పీస్ గా మార్చేశారని చెప్పాలి. అదే సమయంలో రైతులకు తానిస్తానని చెప్పిన రూ.2 లక్షల రుణమాఫీని ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 లోపు అమలు చేస్తానంటూ మరోసారి స్పష్టం చేసిన రేవంత్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్య చేశారు. ‘‘పంట రుణమాఫీకి రూ.40 వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ నేతలు దోచుకున్న మొత్తానికి.. హైదరాబాద్ చుట్టూ దోచుకున్న భూముల విలువ కన్నా అది ఎక్కువ కాదు. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు?’’ అంటూ ఎదురు ప్రశ్నించారు.
పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్లతో ఏర్పాటు చేసిన సమావేశాన్ని తన ఇంట్లో నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి కొన్ని కీలక వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. రాజీనామా చిట్టీ జేబులో పెట్టుకొమ్మని హరీశ్ రావుకు చెప్పా. మోసం చేయాలనుకుంటే వారికి అమరవీరుల స్తూపం గుర్తుకు వస్తుంది. గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా హరీశ్ అక్కడకు వెళ్లారా? ఈ రోజు స్తూపం వద్దకు వెళ్లి అబద్దాలు చెప్పారు. రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్ లో ఉండాలి. సీస పద్యంలా రాస్తే చెల్లుతుందా? హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నాం. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి తీరుతాం’’ అంటూ మరోసారి తన మాటను స్పష్టంగా చెప్పుకొచ్చారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే ఐదు హామీల్ని నెరవేర్చామన్న రేవంత్.. ‘‘రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయి. రేవంత్ కాకుండా మరెవరైనా ముఖ్యమంత్రిగా ఉన్నా వారికి ఓకేనట. నన్ను చూస్తేనే ఒంటిపై జెర్రులు పాకినట్లుగా కేసీఆర్.. కేటీఆర్ లు భావిస్తున్నారు. అందుకే ఎవరితోనైనా కలుస్తామంటున్నారు. ఈ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలిస్తే ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని కేటీఆర్.. కేసీఆర్ లు చెబుతున్నారు. ఎలా వస్తుంది? నేనేమైనా తండ్రి పేరు చెప్పుకొని అమెరికా నుంచి వచ్చి కూర్చున్నానా?’’ అంటూ విరుచుకుపడ్డారు. మొత్తానికి హరీశ్ రాజీనామా సవాలు ఏమో కానీ.. రేవంత్ మాటల ఉతుకుడు.. బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.