విన్నంతనే విస్మయానికి గురయ్యే ఉదంతంగా దీన్ని చెప్పాలి. మీడియా మొగల్ రామోజీ రావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడవటంతో యావత్ తెలుగు ప్రజలంతా ఒకింత వేదనకు గురయ్యారు. ఆయన లోటు ఎవరూ పూడ్చలేనిదిగా చాలామంది ఫీల్ కావటం తెలిసిందే. తెలుగు మీడియా వరకు మేరునగ లాంటి రామోజీ కాలం చేయటాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి. ఇదిలా ఉంటే ఒక ఆసక్తికర వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది.
రామోజీ మరణించిన రోజునే.. ఆయన పుట్టిన ఇంట్లో ఒక మగబిడ్డ జన్మించటం.. ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటున్న వారు రామోజీరావు మళ్లీ తమకు పుట్టినట్లుగా చెప్పుకోవటం ఆసక్తికరంగా మారింది. క్రిష్ణా జిల్లా పామర్రులో లోని పెదపారుపూడిలో 1936లో రామోజీరావు ఒక చిన్న ఇంట్లో జన్మించారు. ఆ ఇంటికి వందేళ్ల చరిత్ర ఉంది. ఇప్పటికి ఆ ఇల్లు బలంగా ఉంటుంది. చెక్కుచెదరని ఆ ఇంట్లో ఇప్పుడు ఒక జంట అద్దెకు ఉంటున్నారు.
యాద్రశ్చికంగా రామోజీ కాలం చేసిన రోజునే.. ఆయన పుట్టిన ఇంట్లో ఉన్న వారికి బిడ్డ జన్మించటం ఆసక్తికరంగా మారింది. దాంతో మళ్లీ రామోజీ పుట్టారంటూ ఆ ఇంటి వారు ఆనందానికి గురవుతున్నారు. రామోజీ పుట్టిన ఇంటిని గతంలో అర్జున్ రావు అనే వ్యక్తి కొన్నారు. ఆ తర్వాత ఆయన కాలం చేయగా.. ఆయన కుమారుడు సుబ్బారావు ఇంటి యజమానిగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం సుబ్బారావు విజయవాడలో ఉంటున్నారు. దీంతో.. ఆ ఇంటిని వెంకట సుజాత కుటుంబానికి అద్దెకు ఇచ్చారు. శనివారం వారింట్లో ఒక మగబిడ్డ పుట్టటం.. దానికి కొద్ది గంటల ముందే రామోజీ తుదిశ్వాస విడవటంతో.. ఆ మహానుభావుడే తన ఇంట్లో మళ్లీ జన్మించి ఉంటారన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాను పుట్టిన ఊరిని రామోజీ ఎప్పుడూ మర్చిపోరు. పుట్టిన గడ్డకు మేలు చేయటం కోసం ఆయన తపిస్తుంటారు. ఏదో ఒక డెవలప్ మెంట్ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. ఆయన మరణంతో ఆ గ్రామం మొత్తం విషాదంలో నిండిపోయిన పరిస్థితి. ఇలాంటి వేళ.. రామోజీ మళ్లీ పుట్టారన్న వార్త ఆసక్తికరంగా మారింది. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు.