ఇప్పుడంటే తనకు తోచింది చుట్టేస్తున్నాడు కానీ.. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాంగోపాల్ వర్మ సొంతంగా చెప్పాలి. తెలుగు సినిమాను రెండు భాగాలు చేస్తే.. అందులో వర్మకు ముందు వర్మ తర్వాత అనే చెప్పాలి.
ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలు.. మహా అయితే కాసింత తమిళనాడు.. మరికాస్త కర్ణాటక మినహా.. మన సినిమాను పెద్దగా పట్టించుకోని రోజుల్లో తెలుగు సినిమా రూపురేఖల్ని.. నిర్మాణ తీరునుసమూలంగా మార్చేసిన క్రెడిట్.. ఒక యావరేజ్ బీటెక్ పూర్తి చేసిన వర్మదే.
ఏ టీవీ చానల్ తో మాట్లాడే వేళలో.. మద్యం తాగుతూ సమాధానాలు ఇవ్వటం.. సోషల్ లో వీడియో పోస్టు చేసే వేళలో.. వోడ్కా తాగుతూ రికార్డు చేయటానికి ఏ మాత్రం మొహమాటపడని తీరు వర్మ సొంతం. ఆయనెంత తలతిక్కగా మాట్లాడినా.. అందులో పాయింట్ ఉంటుంది. తెలివైన లాజిక్ ఉంటుంది?నిజమే కదా? అని కన్వీన్స్ చేసే నేర్పరితనం ఉంటుంది.
అందుకే.. ఆయనేం చెప్పినా.. ఆసక్తిగా వినేటోళ్లు కోట్లల్లో ఉంటారు. అందులో పస ఉందా? లేదా? నస ఎక్కువగా ఉందా? అన్నది పట్టించుకోరు. ఎందుకంటే.. ఆయన చేసే వ్యాఖ్యలు ఏమైనా సరే.. మిర్చి బజ్జీల మాదిరి అదే పనిగా ఆకర్షిస్తాయి.
ఎప్పుడూ ఏ సీరియస్ అంశం మీదా స్టాండ్ తీసుకొని.. మాట్లాడటం వర్మకు పెద్దగా ఇష్టం ఉండదు. కానీ.. ఒకసారి ఏదైనా ఇష్యూను టేకప్ చేస్తే.. తానే పరిస్థితుల్లో ఉన్నా.. ఆ ఇష్యూకు సంబంధించి అప్డేట్స్ ఇవ్వటంలో వర్మ నేర్పరితనం టాలీవుడ్ లో మరే ప్రముఖుడికి లేదనే చెప్పాలి.
ఇప్పటివరకు ఇండస్ట్రీని భుజాన వేసుకొని వర్మ మాట్లాడింది లేదు. అందుకు భిన్నంగా తొలిసారి ఏపీలో సినిమా టికెట్ల ధరపై ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టిన వర్మ.. అదెంత తప్పన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా అదే పనిగా పోస్టులు చేస్తున్న ఆయన..తాజాగా తన ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సమాధానాలు చెప్పటం.. దానికి బదులుగా తన వాదనను వినిపించిన వర్మ.. ఈసారి మరింతగా అదరగొట్టేశారు.
ప్రభుత్వ నిర్ణయం ఎంత డొల్ల అన్న విషయాన్ని సింఫుల్ గా ఒక్క ఉదాహరణతో తేల్చేశారు. పవన్ కల్యాణ్ సినిమా సంపూర్ణేష్ బాబు సినిమా తమకు ఒక్కటే అనేసిన మంత్రిని.. అలా అయితే మంత్రిగా ఉన్న మీరు మీ డ్రైవర్ కు తేడా లేదా?అంటూ సూటిగా ప్రశ్నించారు. తన ప్రశ్నలకు మిగిలిన రాజకీయ నేతల మాదిరి పరుష పదజాలంతో కాకుండా డిగ్నిటీతో సమాదానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అంటూ.. మంత్రి పేర్ని నాని అడిగిన ఒక ప్రశ్నకు భారీ సమాధానాన్నే ఇచ్చారు.
మంత్రివర్యులు ప్రశ్నిస్తూ.. రూ.వంద సినిమా టికెట్ ను రూ.వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్న ప్రశ్నకు వర్మ ఇచ్చిన సమాధానాన్ని యథాతధంగా ఇస్తున్నాం. దీనికి కారణం.. ఏ మాత్రం మార్చినా.. అందులో ఒరిజినాలిటీ మారుతుంది. అందుకే.. ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేసిన దానిని యథాతధంగా ఉంచుతున్నాం.
వర్మ ఏం చెప్పారంటే..
నాని గారు..చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ..ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ ని వెయ్యికి అమ్ముకోవచ్చా? అన్నది క్వశ్చన్ కాదండీ ..అది అమ్మేవాడి నమ్మకం..కొనేవాడి అవసరం బట్టి ఉంటుంది.
మీరు ఎడారి లో నీళ్ళు లేని పరిస్థితి లో ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు రూ.5 లక్షలకి కొనచ్చు. కానీ అది పరిస్థితిని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు అనుకుంటే మార్కెట్ అనేది ఉన్నదే దానికి . కార్ కావాలనే కోరికని ఎక్స్‌ప్లాయిట్ చెయ్యడానికే రకరకాల లగ్జరీ కార్లు తయారు చేసి ఆకర్షిస్తారు. అది తప్పని గవర్నమెంట్ వాటికి అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళం
ముడి పదార్థం 500 రూపాయలు కూడా ఖర్చవ్వని ఒక పెయింటింగ్ ని ,కొనేవాడుంటే రూ.5 కోట్లకి అమ్ముతారు. ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే దాంట్లో ఉన్న బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అడ్వాన్స్మెంట్ అనేది కంటిన్యువస్ గా అన్ని వస్తువులు ఇంకా, ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా అవునా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.
కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది? ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే.. ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి. వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై.
గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం గోధుమ తదితరాలు లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర చాలా పడిపోయినప్పుడు కానీ ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?
‘లూటీ’ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు.. అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది.
థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని మీకు ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో కానీ ఈ డెఫినిషన్ ఉందా? మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.
థియేటర్లనేవి , జూన్ 19 1905 న నికెలోడియోన్ అనే ప్రపంచం లోనే మొట్ట మొదటి థియేటర్ అమెరికా లో పెట్టినప్పటి నుంచి ఈనాటి వరకూ అవి కేవలం బిజినెస్ కోసం పెట్టిన వ్యాపార సంస్థలు. అంతే కానీ ప్రజా సేవ నిమిత్తం ఎప్పుడూ ఎవ్వరూ పెట్టలేదు. కావాలంటే మీ గవర్నమెంట్ లో ఉన్న థియేటర్ ఓనర్లని అడగండి
సొసైటీ ఆధునీకతకి ముఖ్య కారణం మోటివేషన్..ఎందుకంటే ప్రతి మనిషి కూడా మానవ సహజంగా తను ఉన్న పొజిషన్ కన్నా పైకి ఎదగాలని కోరుకుంటాడు .. పేదవాడు ధనికుడవ్వాలని కోరుకుంటాడు, సైంటిస్ట్ ఎవ్వరూ కనిపెట్టలేనిది కనిపెట్టాలనుకుంటాడు .
మీ పార్టీ కార్యకర్త మీలా మంత్రి అవ్వాలని కోరుకుంటాడు .. మీ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటాడు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే.
థియేటర్ లో ఉన్న సౌకర్యాలను చూడకుండా ఆ థియేటర్ ఉన్న ఏరియా బట్టి టికెట్ ప్రైజ్ ఎలా పెట్టారు? వివిధ హోటల్సు లో ఆ ఆ హోటల్ వాళ్ళు వాళ్ళిచ్చే సౌకర్యాలను బట్టే ప్రైజ్ లిస్ట్ పెట్టుకుంటారు. పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా? పేదల కోసం చెయ్యడం అనే మీ ఉద్దేశం మంచిది కావచ్చు.. కానీ దానికోసం పేదల్ని ధనికుల్ని చెయ్యటానికి మీ ప్రభుత్వం పని చెయ్యాలి కానీ ఉన్న దనికుల్ని పేదల్ని చెయ్యకూడదు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ ఇండియాలో కల్లా పేద రాష్ట్రం అయ్యే ప్రమాదముంది.
నానీ గారు నేను ఒక యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని.. ఎకనామిక్స్ గురించి నాకు ఏ బీ సీ డీ కూడా తెలియదు. కానీ మీరు అనుమతిస్తే మీ ప్రభుత్వం లో ఉన్న టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీ కి మీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడ్డ ఈ మిసండర్స్టాన్డింగు (అపోహలు) తొలగిపోవడానికి ఇది చాలా అవసరం అని నా అభిప్రాయం.. థ్యాంక్యూ.