కొన్ని రోజులుగా భారతీయ సినీ ప్రేక్షకుల దృష్టంగా ఆదిపురుష్ చిత్రం మీదే ఉంది. ఈ ఏడాది వేసవిలో ఏ భాషలోనూ పెద్ద సినిమాల సందడి లేకపోవడం, బాక్సాఫీస్ కళ తప్పడం.. తర్వాత రాబోయే ఈ భారీ పాన్ ఇండియా చిత్రం మీద అన్ని భాషల ప్రేక్షకులూ దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తిరుపతిలో జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్, కొత్త ట్రైలర్ సినిమాకు ప్రమోషన్ పరంగా మంచి ఊపే ఇచ్చాయి. ఇదే సమయంలో కొన్ని వివాదాలు కూడా ఆదిపురుష్‌ను చుట్టుముట్టాయి.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దర్శకుడు ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్‌కు వీడ్కోలు చెబుతూ ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదం అయింది. ఓం క్యాజువల్‌గానే ఆమెను ముద్దు కాని ముద్దు ఇచ్చినప్పటికీ.. తిరుమలలో ఇలా చేయడం అపచారం అంటూ కొందరు దీనిపై విమర్శలు గుప్పించారు.
ఈ వివాదం సద్దుమణగకముందే ఆదిపురుష్ టీం మీద ఒక అపవాదు పడింది. ఈ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీట్ ఖాళీగా ఉంచబోతున్నట్లు కొన్ని రోజుల కిందటే ఆదిపురుష్ టీం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఐతే ఆ స్టేట్మెంట్ను మార్ఫ్ చేసి కొందరు దుష్ప్రచారానికి తెర తీశారు. ఆ పోస్టర్లో ఒక చోట దళితులకు ఈ సినిమా థియేటర్లలో ప్రవేశం ఉండదని పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆదిపురుష్ టీం స్పందించింది. ఇది ఫేక్ పోస్టర్ అని పేర్కొంటూ.. ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని అభిమానులు, మీడియాకు సూచించింది. ఏ చిత్ర బృందం అయినా అలాంటి ప్రకటన చేస్తుందని ఎవ్వరూ అనుకోరు. కానీ సోషల్ మీడియా కాలంలో ప్రతిదీ సున్నితంగా మారిపోయిన ఈ రోజుల్లో జనాలు ఏ పాయింట్ పట్టుకుని వివాదం చేస్తారో అర్థం కాని విధంగా పరిస్థితి తయారైంది.