ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఎంత తక్కువగా మాట్లాడుతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనవసరమైన విషయాల్లో అస్సలు వేలుపెట్టడు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండే మనస్తత్వం. అందుకే అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలోని నటీనటులందరితో ప్రభాస్ కు మంచి బాండింగ్ ఉంది.
ఇతర హీరోల సినిమాలు ప్రమోట్ చేసే విషయంలో కూడా ప్రభాస్ ఎప్పుడు ముందుంటాడు. తనవంతు సపోర్ట్ చేస్తాడు. అటువంటి ప్రభాస్ గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్.1 మూవీ అస్సలు నచ్చలేదంటూ ఓపెన్ గా కామెంట్స్ చేశాడు. రాజమౌళికి దర్శకుడిగా డెబ్యూ మూవీ ఇది. మొదట ప్రభాస్ తో స్టూడెంట్ నెంబర్.1 సినిమాను చేయాలని రాజమౌళి భావించాడు. కానీ ప్రభాస్ నో చెప్పడంతో.. ఎన్టీఆర్ కు హీరోగా చేసే అవకాశం లభించింది. 2001లో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్.1 సూపర్ హిట్ అయింది.
అయితే బాహుబలి 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. రాజమౌళి తొలి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నంబర్ 1 తనకు నచ్చలేదని ప్రభాస్ బహిరంగంగా వెల్లడించాడు. `నిజంగా చెప్పాలంటే నాకు స్టూడెంట్ నంబర్ 1 నచ్చలేదు. ఇది పెద్ద బాక్సాఫీస్ హిట్ అయినప్పటికీ, నాకు నచ్చలేదు. వర్షం మూవీ సమయంలో రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ నన్ను ప్రివ్యూకి పిలిచారు. సింహాద్రి చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది అని షాకైపోయాను. రాజమౌళి ఎంతో ప్రతిభావంతుడైన దర్శకుడు. నేను ఆయన తొలి చిత్రాన్ని తిరస్కరించినప్పటికీ.. అతను ఏదీ మనసులో పెట్టుకోకుండా నాతో ఛత్రపతి తీసి బిగ్ హిట్ ఇచ్చాడు` అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అప్పట్లో ప్రభాస్ కామెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.