వైకాపా హయాంలో జగన్ తర్వాత అన్నీ తానై చక్రం తిప్పిన రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులిచ్చారు. ఇప్పటికే వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం తో పలువురు పలువురు నేతలను విచారించిన పోలీసులు.. టీడీపీ ఆఫీస్ దాడిలో సజ్జల ప్రమేయం కూడా ఉందని గుర్తించారు. ఇటీవల ఆయనను ఈ కేసులో నిందితుడిగా చేరుస్తూ కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు
సజ్జల దేశం విడిచి వెళ్లకుండా 15 రోజుల క్రితం లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు. కానీ అంతకు ముందే సజ్జల విదేశాలకు వెళ్లారు. అయితే సోమవారం విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్న సజ్జలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో.. నానా రచ్చ జరిగింది. లుక్ అవుట్ నోటీసు ఉందని చెప్పినా.. సజ్జల అధికారులపై చిందులు తొక్కారు. దాంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు గుంటూరు ఎస్పీకి సజ్జల సమాచారాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎస్పీ..ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు రక్షణలో ఉన్నారని, అదుపులోకి తీసుకోవద్దని సూచించారు.
అయితే తాజాగా సజ్జలకు మంగళగిరి గ్రామీణ పోలీసులు షాక్ ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 120వ నిందితుడిగా ఉన్న సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10:30 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. విచారణ నిమిత్తం మంగిళగిరి పోలీస్ స్టేషన్కు రావాలని సజ్జలకు సూచించారు. కాగా, మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడుగా ఉన్న వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య సోమవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.