సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కంప్యూటర్ సైన్స్ లో MS తరగతులు ప్రారంభించడానికి WSCUC (WASC Senior College & University Commission) నుంచి అనుమతి లభించింది. 2023 జనవరి నించి విద్యార్థులు ఈ కోర్సులో నమోదు చేసుకోవడానికి వీలుగా విశ్వవిద్యాలయ యంత్రాంగం త్వరితగతిన ఏర్పాట్లు చేస్తోంది. విశ్వవిద్యాలయ సొంత భవనంలో ప్రత్యక్ష విద్యా విధానంలో జరుగబోయే తొలి కోర్స్ ఇదే కావడం గమనార్హం.
ఈ కోర్స్ ప్రారంభించడం ద్వారా విశ్వవిద్యాలయం తన లక్ష్యాలను, ఆశయాలను సాధించే దిశలో మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ తరగతిలో చేరే విద్యార్థులు, అత్యాధునిక సాంకేతిక విధానాలైన ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, మెషీన్ ట్రాన్సలేషన్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. తద్వారా ఈ విద్యార్థులు, వారి ఆచార్యులు కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ రంగంలో సరికొత్త ఉపకరణాలను, పద్దతులను తయారుచేయగలిగే అవకాశాలు మెండుగా ఉంటాయి.
ఈ శుభ సందర్భంలో విశ్వవిద్యాలయ మిత్రుల, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సహాయ సహకారాలతో ఇలాంటి మరెన్నో విజయాలను సాధించడానికి విశ్వవిద్యాలయ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని తెలియజేస్తోంది.
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరం లో 2017 వ సంవత్సరంలో ఒక లాభాపేక్ష రహిత సంస్థగా ప్రారంభించబడింది. ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే WASC గుర్తింపు పొందింది. మొట్టమొదట అంతర్జాల మాధ్యమం ద్వారా భారతీయ కళలు (నృత్యం, సంగీతం) భాషలలో(తెలుగు, సంస్కృతం) సర్టిఫికెట్, డిప్లమో మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను అందించడం మొదలుపెట్టింది.