సంక్షేమ పథకాల కోసం డబ్బులను పప్పు బెల్లాలలాగా సీఎం జగన్ పంచిపెడుతున్న వైనంపై చాలాకాలంగా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ చేస్తున్న అప్పులు…వాటికోసం పడుతున్న తిప్పలు…కేంద్రం దృష్టిలోకూడా పడడంతో ఏపీపై ఓ కన్నేసుంచాలని స్వయంగా మోడీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక, దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా, ఆ రాష్ట్రాలలో ఏపీ కూడా ఉందని “ది ప్రింట్” వెబ్ సైట్ సంచలనాత్మక కథనం ప్రచురించడం చర్చనీయాంశమైంది
అధికారిక అప్పుల ఆధారంగా ఆ జాబితాలో ఆంధ్ర నాలుగో స్థానంలో ఉండగా…కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే ఏపీదే మొదటి స్థానం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. జగన్ ఇప్పుడే మేల్కొనాలని, లేదంటూ జగన్ ను మోడీ నిద్ర లేపాలని, లేకుంటే ఏపీకి శ్రీలంకకు పట్టిన గతే పడుతుందని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరో జాతీయ మీడియా సంస్థ ఏపీ అప్పులపై కథనం ప్రసారం చేసింది.
ఈ నేపథ్యంలో ఆ కథనాన్ని ఉటంకిస్తూ జగన్ పై జనసేనాని పవన్ కల్యాన్ సెటైర్లు, పంచ్ లు వేశారు. దేశంలోలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటని ఆ కథనంలో పేర్కొన్నారని పవన్ అన్నారు. శ్రీలంక నుంచి తమిళనాడుకు గంట దూరం అని, కానీ, శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరంలోనే ఉందని పవన్ పంచ్ లు వేశారు.
ఇప్పుడు కావాల్సింది ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం, గడప గడపకి ఎమ్మెల్యేలను పంపడం కాదని జగన్ కు పవన్ హితవు పలికారు. ‘మీరు చేసిన అప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ ను దూరం జరిపే ప్రయత్నం చేయండి’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. సదరు జాతీయ మీడియా చానల్ కథనం వీడియోను కూడా పవన్ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి, పవన్ పంచ్ పై జగన్ అండ్ కో స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు
గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.
Gravitas Link:https://t.co/b5S8kN721c pic.twitter.com/GoaUa5g0UR— Pawan Kalyan (@PawanKalyan) May 16, 2022