తాజాగా తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థలో కొందరు కిరాతకులున్నారని సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని, చాలాచోట్ల వాలంటీర్లు ప్రజలను వేధిస్తున్నారని అన్నారు. జగన్ సంస్కారహీనుడు అని, దిగజారి మాట్లాడుతున్నారని, అయినా సరే జగన్ భార్య గురించి తాను మాట్లాడలేదని చెప్పారు.
జగన్ ను వ్యక్తిగతంగా తాను ఏనాడూ విమర్శించలేదని, కానీ, తనను నీచంగా జగన్ మద్దతుదారులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాఫియా కూడా మహిళల జోలికి పోదని, కానీ, జనసేన మహిళలను మాత్రం వైసీపీ వారు తిడుతున్నారని ఆరోపించారు. వాలంటీర్లు తనకు సోదర సమానులని, వారి పొట్టకొట్టాలన్నది తన ఉద్దేశం కాదని అన్నారు.
వాలంటీర్లంతా చెడ్డవారు అని తాను అన లేదని, ఆ వ్యవస్థ ఎలా పని చేయాలో చెబుతున్నానని అన్నారు. వేతనం ఆశించకుండా పని చేసేవాళ్ళే వాలంటీర్లని, డబ్బులు తీసుకుంటే వాలంటీర్లు ఎలా అవుతారని పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లు ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకు రావాలని, జనసేన బాధితులకు అండగా ఉంటుందన్నారు. మద్యనిషేధాన్ని తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాను బీజేపీతో ఉన్నానా? లేదా? ముస్లింలకు అనవసరమని, ముస్లింలకు మాత్రం న్యాయం చేస్తానని పవన్ చెప్పారు. మరి, తాజాగా వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతల రియాక్షన్ ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.