జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. పార్టీ 10వ ఆవిర్భావ సభను ఉమ్మడికృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం లో నిర్వహిస్తున్నారు. అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్న ఈ సభకు సుమారు లక్ష మందిని తరలించే లా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే పోలీసులు కూడా అనుమతులు ఇచ్చారు. ముందు కాదన్నా.. తర్వాత..రాజకీయంగా వైసీపీకి చెడ్డపేరు వస్తుందన్న కారణంగా.. అనుమతులు మంజూరు చేశారని జనసేన నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే..ఈ ఆవిర్భావ సభపై అనేక అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వైఖరిని పవన్తీసుకుంటారు? పొత్తులతో ముందుకు సాగుతారా? లేక ఒంటరి ప్రయాణానికే కట్టుబ డతారా? అనేది ఈ సభలో తేల్చేయడం ఖాయమని కొందరు అనుకుంటున్నారు. దీంతో ఈ సభపై ఎనలేని అంచనాలు పెరిగిపోవడం గమనార్హం. సాయంత్రం 5 గంటలకు ఈ సభ ప్రారంభం కానుంది.
సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం మాత్రమే సమయం ఉన్నందున.. ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నాయకులు, శ్రేణులకు మార్గనిర్దేశం చేయనున్నారుని అంటున్నారు. పొత్తులు సహా వివిధ అంశంపై పార్టీ వైఖరిని పవన్ కల్యాణ్ ప్రకటించే అవకాశం ఉందని కూడా పార్టీ కీలక నేతలు చెబుతున్నారు. గుంటూరు జిల్లా ఇప్పటంలో జరిగిన పార్టీ 9వ ఆవిర్భావ సభలోనే.. విపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని పవన్ ప్రకటించారు.
అదే విధానానికి కట్టుబడి ఉన్నట్లు ఆ తర్వాత కూడా చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్షాల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు.. కొన్ని నెలల క్రితం విజయవాడలో పవన్‌తో భేటీ అయ్యారు. మరికొన్ని రోజులకు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు. విపక్షాల ఓట్లు చీలకూడదన్న పవన్ ప్రకటనలపై ఆయా భేటీల్లో చర్చ జరిగినట్లు తెలిసింది.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి నడవాలని ఇద్దరు నేతలు అవగాహనకు వచ్చారు. ప్రస్తు తం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నప్పటికీ.. ఉమ్మడి కార్యాచరణ లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ విధానం ఏంటన్నది.. తాజా సభలో పవన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే అందరి దృష్టీ ఇప్పుడు మచిలీపట్నంపైనే పడడం గమనార్హం.