ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఎమ్మెల్సీ స్థానం గెలవగానే సరికాదని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీదే ఘనవిజయమని మంత్రి రోజాతో పాటు వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, పులివెందులలో టిడిపి పాగా వేస్తుందని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై రోజా స్పందించారు.
పులివెందుల చెక్ పోస్ట్ కూడా తాకలేరు అంటూ టిడిపి నేతలపై రోజా విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రోజా విమర్శలకు టిడిపి ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ దీటుగా బదులిచ్చారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా టిడిపి యువ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రలో పాల్గొన్న అనురాధ…రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత కూడా టీడీపీ అధినేత చంద్రబాబుదేనని, ఆ విషయాన్ని రోజా గుర్తుపెట్టుకోవాలని అనురాధ పంచ్ వేశారు.
పులివెందుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కూడా టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారని, రోజా సినిమా డైలాగుల వల్ల ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. రోజాకు అబద్దాలు చెప్పడం అలవాటేనని, అమరావతిపై కూడా గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అమరావతి గ్రాఫిక్స్ అని గతంలో రోజా విమర్శించారని గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఏపీఐఐసీ బిల్డింగ్ మీద నుంచి దూకితే ఆ బిల్డింగ్ గ్రాఫిక్స్ కాదని తెలుస్తుందని గతంలో రోజాకు సవాల్ విసిరిన విషయాన్ని అనురాధ గుర్తు చేసుకున్నారు.
రోజా ఎప్పుడు ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదని, చిరంజీవిని కలిసిన మరుసటిరోజే ఆయన కుటుంబంపై రోజా విమర్శలు గుప్పిస్తుందని అనురాధ విమర్శించారు. ఆ రకంగా నిలకడ లేని మాటలు మాట్లాడే రోజా వంటి వారు చేసిన వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని అన్నారు. వైసీపీపై సొంత పార్టీ ఎమ్మెల్యేలకు అసంతృప్తి ఉందని తన ఎన్నికతో స్పష్టమైందని అన్నారు. వివేక హత్యతో జనంలో సానుభూతి పొంది 151 సీట్లు గెలిచారని, ఈసారి ఎవరిని చంపి వై నాట్ 175 అంటూ 175 స్థానాల కోసం జనంలోకి వెళ్తున్నారని అనురాధ నిలదీశారు.
ఈరోజు వివేకా హత్యకు కారణం ఎవరు అన్నది తేల్చేందుకు సీబీఐ విచారణ జరుగుతోందని, వైఎస్ జగన్ తో పాటు వైఎస్ భారతి బంధువులపై కూడా ఈ హత్య కేసులో ఆరోపణలు వచ్చాయని అనురాధ గుర్తు చేశారు. పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నారని అనురాధ అన్నారు. టిడిపి ఎప్పుడు గెలుస్తుంది? సీఎంగా చంద్రబాబును ఎప్పుడు చూస్తామని ప్రజలంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని అనురాధ అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి విజయం, చంద్రబాబు సీఎం కావడం, అమరావతి రాజధాని కావడం తధ్యం అని అనురాధ జోస్యం చెప్పారు.