బ్లూ మీడియాగా పిలవబడే సాక్షిపై ఎన్నారై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ మండిపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో వ్యభిచార గృహాలపై పోలీసులు ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. టెక్సాస్ స్టేట్లోని డెంటన్ కంట్రీ పోలీసులు యాంటీ ప్రాస్టిట్యూషన్ పేరుతో 14, 15 తేదీల్లో వివిధ ప్రాంతాలపై ప్రత్యేకంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
48 గంటల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ లో మొత్తం 18 మంది నిందుతులు పట్టబడ్డారు. అయితే నిందితులలో ఏడుగురు ఇండియన్స్ కాగా.. వారిలో ఐదుగురు తెలుగువారు కావడం సంచలనం రేపింది. టెక్సాస్ లోని డెంటన్ లో ఏడుగురు భారతీయుడు వ్యభిచారం కేసులో ఆరెస్ట్ అయ్యారంటూ.. వారి ఫొటోలు, పేర్లు, ఇతర వివరాలను మంగళవారం పోలీసులు విడుదల చేశారు.
అందులో బండి నిఖిల్- డెంటన్, గల్లా మోనిష్- టెక్సాస్, కుమ్మరి నిఖిల్- డెంటన్, మేకల జైకిరణ్ రెడ్డి- డెంటన్, రాయపాటి కార్తీక్- డెంటన్ తెలుగువారు కాగా.. నబీన్ శ్రేష్ట- టెక్సాస్, అమిత్ కుమార్- టెక్సాస్ ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. అయితే తెలుగు వారైన రాయపాటి కార్తీక్, గల్లా మోనిష్ చౌదరి టెక్సాస్ ఎన్నారై టీడీపీ వింగ్ కో-ఆర్డినేటర్లు అంటూ సాక్షి మీడియా ప్రచురించింది. అయితే తాజాగా ఈ విషయాన్ని ఖండిస్తూ ఎన్నారై టీడీపీ అమెరికా అధ్యక్షుడు ‘జయరాం కోమటి’ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
ఇటీవల యూఎస్ఏ పోలీస్ స్టింగ్ ఆపరేషన్లో పట్టుబడిన ఐదుగురు తెలుగు వ్యక్తుల్లో ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్లుగా ఉన్నారంటూ సాక్షి మీడియా ప్రచురించిన వార్తా కథనం మా దృష్టికి వచ్చింది. అది పూర్తిగా అవాస్తవం. ఈ నిరాధార ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బ్లూ మీడియా మా విభాగం ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. నకిలీ ప్రచారానికి ఇది మరొక ఉదాహరణ. తప్పుదారి పట్టించే ఈ కథనాన్ని సాక్షి న్యూస్ ఉపసంహరించుకోవాలి.. తెలుగు కమ్యూనిటీకి క్షమాపణలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో సాక్షి న్యూస్ మీడియాపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నివేదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం` అంటూ ఎన్నారై టీడీపీ అమెరికా అధ్యక్షుడు ‘జయరాం కోమటి’ తన ప్రెస్ నోట్ లో తెలిపారు. దీంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ గా మారింది.