అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినంతనే పలు దేశాలపై సుంకాలు విధిస్తానని.. ఆంక్షలు విధిస్తానని.. సాయానికి కోత పెడతానని చెప్పిన ట్రంప్.. అన్నట్లే అన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే ఎడాపెడా నిర్ణయాలతో హడలెత్తిస్తున్న ఆయన.. తాజాగా మరో సంచలనానికి తెర తీశారు.
పలు దేశాల మీద దిగుమతి సుంకాల్ని విధిస్తానని చెప్పిన ట్రంప్.. తాజాగా కెనడా.. మెక్సికో దిగుమతులపై 25 శాతం.. చైనాపై 10 శాతం సుంకాల అమలు ఫైలు మీద సంతకం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ నేరుగా వెల్లడించటం గమనార్హం. దీంతో తాను చేసిన హెచ్చరికలకు తగ్గట్లే తన పాలన ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసినట్లైంది.
తన తాజా నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు. ఫెంటనిల్ తో సహా తమ దేశ పౌరులను చంపే చట్టవిరుద్ధమైన.. ప్రాణాంతకమైన మాదకద్రవ్యాల ముప్పు కారణంగానే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పిన ట్రంప్.. ‘మాకు అమెరికన్లను రక్షించాల్సిన అవసరం ఉంది. అందరికీ భద్రత కల్పించటం అధ్యక్షుడిగా నా బాధ్యత’’ అని స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా చట్టవిరుద్ధ వలసదారులను.. మాదకద్రవ్యాలను దేశ సరిహద్దుల్లోకి రాకుండా చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చానని.. తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా తాను చెప్పినవన్నీ చేస్తానన్న సంకేతాల్ని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్ తీరు.. పలు దేశాలకు ఇబ్బందికరంగా మారనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తన టీంను సెట్ చేసుకునే క్రమంలో ఒక కీలక అధికారిపై వేటు వేశారు. సదరు అధికారి భారత సంతతికి చెందిన వాడు కావటం గమనార్హం.
ట్రంప్ టీంలో పలువురు భారత సంతతి అధికారులు ఉన్నప్పటికి.. తాజా వేటుకు కారణం లేకపోలేదు. బైడెన్ హయాంలో వినియోగదారుల ఆర్థిక రక్షణ బ్యూరో డైరెక్టర్ గా వ్యవహరించిన రోహిత్ చోప్రాను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రెడిట్ రిపోర్టుల నుంచి వైద్య రుణాల్ని తొలగించటం లాంటి సంస్కరణలను డెమోక్రటిక్ ప్రభుత్వంలో చోప్రా తీసుకొచ్చారు. తాజాగా వేటు పడిన చోప్రాను.. ట్రంప్ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ఫెడరల్ ట్రేడ్ కమిషన్ డెమోక్రటిక్ సభ్యుడిగా ఎంపిక చేసుకున్నారు. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. నిజానికి ట్రంప్ విధానాలకు అనుగుణంగా పని చేసేందుకు చోప్రా నేత్రత్వంలోని టీం సిద్ధమైనా..ఆయన్ను తొలగిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవటం.. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ కావటం చకచకా జరిగిపోయాయి.