మదగజరాజా.. తమిళంలో సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ అయిన సినిమా. ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందీ చిత్రం. ఈ మ ూవీ అంత పెద్ద సక్సెస్ కావడం ఇండస్ట్రీలో పెద్ద సంచలనం. మామూలుగా చూస్తే విశాల్ సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద విషయం కాదు. 2023లో వచ్చిన అతడి చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ వంద కోట్ల మైలురాయిని కూడా అందుకుంది. ఐతే ‘మదగజరాజా’ను దీంతో పోల్చి చూడలేం. ఎప్పుడో 2011లో మొదలై.. 2013లో విడుదలకు సిద్ధమైన సినిమా ఇది. కానీ ఏవో కారణాల వల్ల రిలీజ్కు నోచుకోలేదు. చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సినిమా ఎప్పటికీ బయటికి రాదనుకుంటే.. అనూహ్యంగా ఈసారి సంక్రాంతి రేసులోకి వచ్చింది. ఇంత పాత సినిమాను తమిళ ప్రేక్షకులు ఏం పట్టించుకుంటారులే అనుకుంటే.. దాన్ని బ్లాక్ బస్టర్ చేసి పడేశారు.
దీంతో తెలుగులో ఈ నెల 31న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తెలుగులోనూ మ్యాజిక్ జరుగుతుందేమో అని చూశారు నిర్మాతలు. కానీ తెలుగులో రిలీజ్ ముంగిట బజ్ తెచ్చుకోవడంలో ఫెయిలైన ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత కూడా ఆడియన్స్ దృష్టిని ఆకర్షించలేకపోయింది. తమిళంలో కొన్నేళ్ల నుంచి రొటీన్ సినమాలనే ఆదరిస్తున్నారు. ‘మదగజరాజా’ సినిమా విషయంలో సింపతీ ఫ్యాక్టర్ వర్కవుట్ అయింది. నిర్మాతల మీద జాలిపడ్డారు.
అలాగే రిలీజ్ ముంగిట విశాల్ అనారోగ్యం పాలవడం కూడా సానుభూతికి దారి తీసింది. సినిమాలో ఎంటర్టైన్మెంట్కు కూడా అక్కడి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా తాము కొన్నేళ్ల నుంచి మిస్సవుతున్న సంతానం కామెడీకి వాళ్లు ఫిదా అయిపోయారు. సరైన పోటీ లేకపోవడం కూడా కలిసొచ్చింది. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాతో ఎమోషనల్ కనెక్షన్ ఏమీ లేకపోయింది. పైగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూపంలో మంచి ఛాయిస్ ఉండడంతో ‘మదగజనరాజా’ను అస్సలు పట్టించుకోలేదు. ఈ సినిమా రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియని పరిస్థితి. మొత్తంగా తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన చిత్రం.. తెలుగులో మాత్రం మినిమం సౌండ్ చేయలేకపోయింది.