ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశం ఉన్న ఏకైక రంగం రాజకీయ రంగం. శత్రువులు మిత్రులు అవుతారు. స్నేహితులు కాస్తా శత్రువులుగా మార్చేస్తుందీ పాడు రాజకీయం. తండ్రికి.. కొడుక్కి.. తల్లికి బిడ్డను కాకుండా చేసే పాడు రాజకీయం.. ఎప్పుడు ఏ రకంగా అయినా మారిపోతుంది. తాజా పరిణామాలే దీనికి నిదర్శనం. వైసీపీ అధినేత.. మాజీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయ సాయిరెడ్డి తాజాగా తాను చేసిన పనితో రాజకీయంగా సంచలనంగా మారారు.
మొన్నటికి మొన్న రాజకీయం వద్దు.. వ్యవసాయం ముద్దు అన్న ఆయన తన రాజ్యసభ పదవికి రాజీనామా చేసేయటం.. తాను వ్యవసాయం చేసుకుంటున్నానంటూ కొన్ని ఫోటోల్ని షేర్ చేయటం తెలిసిందే. దీంతో.. విజయ సాయి రెడ్డి కాస్తా.. వ్యవ‘సాయి’ రెడ్డిగా కొందరు అభివర్ణించటం తెలిసిందే. అలాంటి ఆయన జగన్ తో రాజకీయ వైరం పెట్టుకున్న సోదరి షర్మిలతో తాజా భేటీ కావటం తీవ్ర కలకలాన్ని రేపింది. నిజానికి ఈ భేటీ మూడు రోజుల క్రితమే జరిగినట్లుగా చెబుతున్నారు.
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. హైదరాబావద్ కు వచ్చి షర్మిల ఇంటికి వెళ్లారని.. దాదాపు 3 గంటల పాటు అక్కడే ఉండి భోజనం కూడా చేసిన వైనం బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన సోదరి షర్మిలకు మధ్య కుటుంబ.. రాజకీయ సంబంధాలు సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ఉప్పు నిప్పులా మారటం తెలిసిందే.
ఈ సమయంలో జగన్ కు సన్నిహితంగా ఉండే విజయసాయి మీద ఆమె ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాదు.. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించినట్లుగా విజయసాయి చేసిన వ్యాఖ్యలపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు విజయసాయి రిటైర్మెంట్ మీదా ఘాటుగా స్పందించిన ఆమె.. జగన్ విశ్వసనీయతను కోల్పోయారు కాబట్టే విజయసాయి వైసీపీ నుంచి వెళ్లిపోతున్నట్లుగా వ్యాఖ్యానించారు. అలాంటి విజయసాయి.. గుట్టుచప్పుడు కాకుండా షర్మిలతో భేటీ కావటం.. దాదాపు మూడు గంటల పాటు తాజా రాజకీయాల గురించి చర్చించుకున్న వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమనే దానికి ఇదో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు.